చికోటి ప్రవీణ్ కి ముందస్తు బెయిల్

చికోటి ప్రవీణ్ కి ముందస్తు బెయిల్

అనుమతులు లేకుండా గన్స్​ క్యారీ చేశారన్న కేసు సంబంధించి క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్​కి కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు జులై 26న తీర్పునిచ్చింది. గతంలో చికోటి ప్రవీణ్ ప్రైవేట్ గన్‌మెన్లతో లాల్ దర్వాజ సింహవాహని అమ్మవారి బోనాలకు వెళ్లారు. 

వాళ్ల దగ్గర వెపన్స్ ఉండటంతో.. చికోటి ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు అడ్డుకున్నారు.  వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేయకుండా గన్‌లు వాడుతున్నారన్న ఆరోపణలతో నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం  ప్రవీణ్‌ను ఈ కేసులో ఏ1గా మార్చారు. 

ఆయన ముగ్గురు గన్‌మెన్‌లు రమేష్‌గౌడ్‌, సుందర్‌నాయక్‌, రాకేష్‌కుమార్‌లను రిమాండ్‌కు తరలించి వారి నుంచి గన్స్​ స్వాధీనం చేసుకున్నారు.అయితే తనను ఈ కేసులో కుట్రపూరితంగా ఏ1గా చేర్చారంటూ ప్రధాన నిందితుడు ఆరోపించారు. 

ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.  ఇదే క్రమంలో ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించడం.. కోర్టు తీర్పు అనుకూలంగా రావడం ప్రవీణ్ కి ఊరటనిచ్చే విషయం.