చెన్నై: తమిళనాడులో చికెన్ గున్యా విజృంభిస్తోంది. చెన్నై, విల్లుపురం, తెన్కాసి, తేని, కడలూరు, చెంగల్పట్టు, కాంచీపురం, అరియలూర్ జిల్లాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. చికెన్ గున్యా చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (DPH) కీలక హెచ్చరికలు జారీ చేసింది.
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పర్యవేక్షణ, రోగ నిర్ధారణ, దోమల నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. వెక్టర్ బ్రీడింగ్‌కు కాలానుగుణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున అప్రమత్తత చాలా అవసరమని హెచ్చరించింది. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తీవ్ర అలసటతో బాధపడుతున్న వారిని గుర్తించి ముందస్తు వైద్యం అందించాలని సూచించింది. రోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రక్త నమూనాలను సేకరించి IgM ELISA పరీక్షలు చేయాలని చెప్పింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు.. అలాగే డయాగ్నస్టిక్ సెంటర్లు కేసుల వివరాలను ఎప్పటికప్పడూ అప్డేట్ చేస్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని వైద్యశాఖ ఆదేశించింది. ఆసుపత్రులలోని డెంగ్యూ, చికున్‌గున్యా స్పెషల్ వార్డుల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని.. తగినంత బెడ్ స్ట్రెంత్, రోగులకు తగినన్ని దోమతెరలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అధిక-ప్రమాదకర ప్రాంతాలలో వారానికొకసారి ఫాగింగ్, స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్‌లను చేపట్టాలని సూచించింది.
చికున్‌గున్యా అంటే ఏంటి:
చికున్‌గున్యా వ్యాధి చికున్‌గున్యా వైరస్ వల్ల వస్తుంది. ఇది వ్యాధి సోకిన ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ అల్బోపిక్టస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్‌ను మోసుకెళ్లే దోమ కాటు వేసిన 3 నుండి 7 రోజుల్లోపు ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ వైరస్ వల్ల జ్వరం, దద్దుర్లు, అలసట వస్తాయి, కానీ అత్యంత ముఖ్యమైన లక్షణం కీళ్ల నొప్పి.
►ALSO READ | వేరే మతం యువకుడిని ప్రేమించిందని బిడ్డను కొట్టి చంపిర్రు.. యువకుడిని కూడా వదల్లేదు..!
ఈ లక్షణాలు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లోనే తగ్గిపోతాయి, కానీ కొంతమంది ఎక్కువకాలం పాటు అనారోగ్యంతో బాధపడవచ్చు. వీరికి వారాలు లేదా నెలలు కొన్నిసార్లు సంవత్సరాల పాటు కీళ్ల నొప్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి, గ్వాంగ్‌డాంగ్‌లో 8,000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇది చైనా చరిత్రలోనే అతిపెద్ద చికున్‌గున్యా వ్యాప్తిగా నమోదైంది.
చికున్‌గున్యా వ్యాప్తి:
ఈ వ్యాధి మొదట 1952లో టాంజానియాలో బయటపడింది, తరువాత దశాబ్దాలలో ఇతర ఆఫ్రికన్, ఆసియా దేశాలలో కూడా వ్యాపించింది. 2004 నుండి ప్రపంచవ్యాప్తంగా చాలారకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ వైరస్ 110 కంటే ఎక్కువ దేశాలలో కనిపించింది. ఏడాది మొత్తంలో దోమలు ఉండే ప్రదేశాలు, నగరాలలో కేసుల వ్యాప్తి సర్వసాధారణం. వాతావరణ మార్పు, ప్రపంచవ్యాప్త ప్రయాణం కూడా చికున్‌గున్యా వ్యాప్తికి కారణమవుతాయి.
చికిత్స లేదా టీకాలు:
చికెన్‌గున్వాకు ఎలాంటి మందులు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, రెండు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్‌లు ఉన్నాయి , కానీ అవి పెద్దగా అందుబాటులో లేవు. USలో వైరస్‌కు గురయ్యే అవకాశం ఉన్న ప్రయాణికులు లేదా ల్యాబ్ కార్మికులకు మాత్రమే వీటిని సిఫార్సు చేస్తారు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గ్వాంగ్‌డాంగ్‌కు వచ్చే ప్రయాణికులకు దోమల నివారణ, టీకాలు వేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక నోటీసు కూడా జారీ చేసింది.
