
కొడిమ్యాల, వెలుగు: ఇంట్లో ఆడుకుంటుండగా కరెంట్ షాక్ తగిలి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కొడిమ్యాలలో చోటుచేసుకుంది. మండలంలోని గంగారాం తండా గ్రామానికి చెందిన భ్యూక్యా శ్రీనివాస్, మమత దంపతులకు కుమారులు తిరుపతి (7), అక్షయ్(1), కూతురు మల్లేశ్వరి(4) ఉన్నారు. తండ్రి భూక్క శ్రీనివాస్ కొంతకాలంగా గల్ఫ్ లో జీవనోపాధి కోసం వెళ్లాడు. తల్లి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.
ఇటీవల ఇంటి బయట రేకుల కింద ఉన్న బోరు కరెంట్ వైరు తెగిపోయింది. అక్షయ్ అంబాడుతూ వెళ్లి వైరును ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్సత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
బాలున్ని ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకునేవాళ్లమని, బుడిబుడి అడుగులతో అల్లరి చేసే చిన్నారి చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తండా వాసులు బోరును విలపిస్తున్నారు. తల్లి భూక్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు కొడిమ్యాల ఎస్ఐ శివ కృష్ణ తెలిపారు.