బాల్యంలో దెబ్బ.. బతుకుకే శాపం.. ఆ ప్రభావంతో పిల్లల్లో తగ్గుతున్న ఎత్తు, బరువు

బాల్యంలో దెబ్బ.. బతుకుకే శాపం.. ఆ ప్రభావంతో పిల్లల్లో తగ్గుతున్న ఎత్తు, బరువు
  • చిన్నప్పటి చేదు అనుభవాలే పెద్దయ్యాక రోగాలు
  • ఆ ప్రభావంతో పిల్లల్లో తగ్గుతున్న ఎత్తు, బరువు
  • యువతుల్లో పీసీవోఎస్, డిప్రెషన్ల ముప్పు
  • యువకుల్లో మెదడు మందగింపు..నేరాల బాట
  • ఢిల్లీ యూనివర్సిటీ స్టడీలో సంచలన విషయాలు
  • పదేండ్లలో వచ్చిన 17 కీలక రీసెర్చ్​లతో రిపోర్ట్


 
హైదరాబాద్, వెలుగు: చిన్నతనంలో ఇంట్లో గొడవలు, పెద్దల తిట్లు,  దెబ్బలు, వివక్ష, కుటుంబసభ్యుల నిర్లక్ష్యం.. ఇవన్నీ పిల్లల మనసుపైనే కాదు, వారి భవిష్యత్తు ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బాల్యంలో ఎదురయ్యే చేదు అనుభవాలు(అడ్వర్స్ చైల్డ్‌‌‌‌‌‌‌‌హుడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్సెస్) పెరిగి పెద్దయ్యాక తీవ్రమైన శారీరక, మానసిక రోగాలుగా, వ్యసనాలుగా మారుతున్నాయని రీసెంట్ రీసెర్చ్ లో వెల్లడైంది. ఢిల్లీ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ డిపార్ట్​మెంట్ కు చెందిన రీసెర్చర్లు హబీబా హారూన్, ప్రొఫెసర్ దుర్గా రావు పెదాడ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పిల్లలు, యువతపై 2016 నుంచి 2026 మధ్య వచ్చిన 17 కీలక రీసెర్చ్ లను శాస్త్రీయంగా విశ్లేషించి ఈ రిపోర్టును రూపొందించారు. చిన్ననాటి చేదు అనుభవాల వల్ల పిల్లల్లో ఎత్తు, బరువు తగ్గడం, మెదడు చురుకుదనం మందగించడం, యువతుల్లో పీసీవోఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ  సిండ్రోమ్)  ముప్పు రెట్టింపవడం, అబ్బాయిలు నేరాల బాట పట్టడం వంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో  పిల్లల ఖాళీ సమయం, వారి స్నేహితులపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచా లని, స్కూళ్లలో చదువులే కాకుండా కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలోని పల్లెలు, పట్టణాల్లోని పిల్లలు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమిళనాడు, ఒడిశా అనాథాశ్రమాల్లో 86.7 శాతం మంది, పుదుచ్చేరిలో 57.3 శాతం మంది, ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో 72.3 శాతం మంది, మధ్య భారతదేశంలోని గ్రామీణ బడుల్లో వంద శాతం మంది పిల్లలు ఏదో ఒక రకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు గుర్తించారు. గ్రామీణ హర్యానాలో పసిపిల్లల్లో ఎత్తు, బరువు పడిపోవడమే కాకుండా వారి శరీర కదలికలు, జ్ఞాపకశక్తి, భాషా పరిజ్ఞానం దారుణంగా మందగిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్ స్టడీ ప్రకారం.. చిన్నతనంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వేధింపులు ఎదుర్కొన్న యువతుల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని పీసీవోఎస్ వ్యాధి బారిన పడే ప్రమాదం 2.1 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.

అబ్బాయిల్లో వ్యసనాలు.. 
అమ్మాయిల్లో డిప్రెషన్​..
 

చిన్ననాటి చేదు జ్ఞాపకాలు అమ్మాయిలు, అబ్బాయిలపై వేర్వేరుగా ప్రభావం చూపుతున్నాయి. అబ్బాయిల్లో శారీరక హింస ఎక్కువై వారు పెద్దయ్యాక విపరీతమైన కోపంతో ఇతరులపై దాడులు చేయడం, సిగరెట్, మద్యం, గంజాయి లాంటి వ్యసనాల బారిన పడడం, మహిళలపై వివక్ష చూపడం పెరిగిపోతోంది. కేరళ జైళ్లలోని కరడుగట్టిన నేరగాళ్లలో, వారణాసిలో డ్రగ్స్ వాడే యువకుల్లో చిన్ననాటి హింసే నేరాలకు మూలకారణమని తేలింది. మరోవైపు అమ్మాయిలు తీవ్ర నిర్లక్ష్యం, లైంగిక వేధింపుల వల్ల డిప్రెషన్, తీవ్రమైన ఆందోళనతో కుంగిపోతున్నారు. ముఖ్యంగా యూపీ, బిహార్ స్టడీల్లో అబ్బాయిలతో (2.19 శాతం) పోలిస్తే తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయిల్లో ఆత్మహత్య ఆలోచనలు (5.05 శాతం) రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై  బాలికల్లో కోపాన్ని లోపలే దాచుకుని కుమిలిపోయే మనస్తత్వం కనిపిస్తుండగా, వేధింపులకు గురైన పిల్లల్లో అతి చిన్న వయసులోనే అపరిపక్వ శృంగార అనుభవాల బారిన పడే ముప్పు కూడా పెరుగుతోందని గుర్తించారు.

దేవుడిని వేడుకుంటున్న హైదరాబాద్ పిల్లలు.. 

హైదరాబాద్ సిటీ స్కూళ్లలో 139 మంది విద్యార్థులపై జరిగిన  స్టడీలో.. బాలికల (33.3 శాతం) కంటే బాలురే (52.8 శాతం) ఎక్కువగా చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్న పిల్లల్లో తీవ్ర అశాంతి నెలకొనగా, బాధను తట్టుకోవడానికి హైదరాబాద్ పిల్లలు దైవభక్తిని ఆశ్రయిస్తున్నారని, ముఖ్యంగా బాలికలు ప్రార్థనలను రక్షణ కవచంగా మార్చుకుంటున్నారని తేలింది. అలాగే, కుటుంబ పరిస్థితులతో పాటు టెక్నాలజీ కూడా పిల్లలను ఉచ్చులోకి లాగుతోందని రీసెర్చ్ తేల్చింది. చిన్న వయసులోనే స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు ఇవ్వడం వల్ల దాదాపు మూడు రెట్లు, పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వల్ల రెండున్నర రెట్లు పిల్లలకు ముప్పు పెరుగుతోంది. తల్లిదండ్రుల విడాకులు, ఉద్యోగాల బిజీతో పిల్లలను పట్టించుకోకపోవడం, చదువు మధ్యలోనే  మానేయడం ఈ సమస్యలను మరింత పెంచుతున్నాయి.