Childrens day special 2025: చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా... పాడండి... పాడించండి..!

Childrens day special 2025: చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా... పాడండి... పాడించండి..!

ప్రస్తుతం మూడేళ్ల పిల్లలు  కూడా లేస్తే చాలు జానీ జానీ ఎస్​ పాప అంటూ పాడుతున్నారు.  కాని పూర్వకాలంలో చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా.. ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు.. ఆకేసి, పప్పేసి....' ఎన్నో   అందమైన పాటలను పిల్లలకు నేర్పించేవారు.  ఇప్పుడు వాటిని నేర్పడం లేదు కదా.. అసలు వాటి గురించే పిల్లలకు చెప్పడం లేదు. నవంబర్​ 14 బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు నేర్పాల్సిన తెలుగు రైమ్స్​ గురించి తెలుసుకుందాం. . . .

'చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, తోట కెళ్లావా పండు తెచ్చావా, గూట్లో పెట్టావా గుటుక్కున మింగావా'... 'ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు..."వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమి...' 'ఆకేసి, పప్పేసి....' ఎన్నో ఉన్నాయి మనకు బాలగేయాలు. చిన్నప్పుడు ఇళ్లలోని పెద్దవాళ్లు పిల్లలకు నేర్పించే వాళ్లు. పెద్దపెద్ద నగరాల్లోనే కాదుపట్టణాల్లోనూ ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి. పిల్లలు తాత, నానమ్మ. అమ్మమ్మల ఆప్యాయతలకు దూరమవుతున్నారు. 

ఆనాటి తెలుగు బాలగేయాలు పాతపడి పోయాయి అనుకోనక్కర లేదు. కానీ ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా కదిలే బొమ్మల రూపంలోకి మారాయి. నేడు 2D,3D యానిమేషన్లో ఎన్నో బాలగేయాలను అందమైన చిత్రాలతో రూపొందించాయి పలు సంస్థలు.
మార్కెట్లో అవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. పిల్లల రైమ్స్ పేరిట సీడీలు, డివీడీలు దొరుకుతున్నాయి. మొబైల్​ గేమ్స్ ఆడడానికి, టీవీ చూడ్డానికే అలవాటు పడిన చిన్నారులకు ఇవి చూపిస్తే ఎగిరి గంతేస్తారు. అంతేకాదు. మన తెలుగు గేయాలను బొమ్మలు చూస్తూ సులభంగా నేర్చుకుంటారు. మన సంప్రదాయాలు, పాటలకు ఈతరం పిల్లలు దూరమయ్యారని బాధపడే కన్నా మారిన పరిస్థితుల్లో మన బాలగేయాలను ఇలా నేర్పించడం అవసరం.  

పసిపిల్లల ముందు మీరు పాటయి…పల్లవించాలి అని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏడాదిలోపు తడబడే వారి చరణాలకు మీ చరణాలే ఆలంబన అని తెలుసుకుని గొంతు విప్పి పాడండి. పాడితే పోయేదేమీ లేదు…మీ పిల్లల భాష మెరుగుపడడం తప్ప.  మన తాతలు పాడిన పాటలు.. ఆడించిన ఆటలు.. ఇప్పుడు మన పిల్లలకు ఎంత వరకు నేర్పుతున్నామో గ్రహించాలి.మరి పిల్లలకు ఆదిశగా మనం చిన్నప్పుడు నేర్చుకున్న నీతి పద్యాలను .. ఆటలను మన పిల్లలకు కూడా నేర్పుదాం. . .!