హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో పార్కులు కాపాడినందుకు అక్కడి చిన్నారులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. కాకతీయ కాలనీలో 600 గజాలు, 1500 గజాల రెండు పార్కులను కాపాడినందుకు హైడ్రాకు మద్దతు తెలుపుతూ ఆదివారం ర్యాలీ నిర్వహించారు. హైడ్రా జిందాబాద్ అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ‘మాకు ఆడుకునేందుకు స్థలం దొరికింది’ అని సంబురపడ్డారు. పార్కులో మొక్కలు నాటి జాగ్రత్తగా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
హైడ్రాకు కూకట్పల్లి ఎమ్మెల్యే అభినందనలు
కూకట్పల్లి: కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు హైడ్రా కమిషనర్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. నల్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
చెరువు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించడానికి తాను కృషి చేస్తానన్నారు. నల్ల చెరువు అభివృద్ధి రెండు సంవత్సరాల వరకు మాత్రమే హైడ్రా పరిధిలో ఉంటుందని తెలిసిందని, ఆ తర్వాత టేక్ఓవర్చేసే వారు కూడా చెరువు అభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
