
- ఉన్న ఇద్దరు డాక్టర్ల బదిలీ
- మళ్లీ భర్తీ చేయని ప్రభుత్వం
- ఏడాదిగా నిలిచిపోయిన సేవలు
- 5 నుంచి10 ఏండ్ల పిల్లలు నిలోఫర్‌కు..
- ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్, వెలుగు: సిటీలో నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ హాస్పిటల్స్తర్వాత ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేది నల్లకుంట ఫీవర్ హాస్పిటల్(కోరంటి దవాఖాన) కే...జ్వరం నుంచి మొదలుకుంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు, ఫ్లూ, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు కోరంటి దవాఖాన పెట్టింది పేరు.
కార్పొరేట్‌లో కూడా నయం కాని మొండి జ్వరాలు, సీజనల్ వ్యాధులకు ఇక్కడి ట్రీట్మెంట్ తో చెక్ పడుతుందనేది రోగుల నమ్మకం. ఇదే నమ్మకంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జనాలు ఫీవర్ హాస్పిటల్ కు తరలివస్తుంటారు. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్ లో రోజుకు సగటున 500 ఓపీ నమోదు అవుతుండగా, సీజన్ లో ఇది వెయ్యి దాటుతుంది. అయితే, అంతా బాగానే ఉన్నా...ఏడాదిగా ఫీవర్ హాస్పిటల్ లో ఉన్న పీడియాట్రిక్ విభాగాన్ని ఇక్కడి వైద్యాధికారులు మూతేశారు.
దీంతో ఈ హాస్పిటల్ కు వచ్చే ఐదు నుంచి పదేండ్ల పిల్లల్ని డాక్టర్లు నిలోఫర్హాస్పిటల్కు పంపిస్తున్నారు. దీంతో పిల్లలతో హాస్పిటల్ కు వచ్చే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటేషన్ పై అయినా డాక్టర్లను పెట్టి వైద్య సేవలందించాల్సింది పోయి ఏకంగా విభాగాన్ని మూసివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
డిప్యుటేషన్లేదు అవుట్సోర్సింగూ లేదు..
గత ఏడాది కోరంటి దవాఖానలోని పీడియాట్రిక్ విభాగంలో ఉన్న ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసినా మళ్లీ కొత్తవారిని నియమించలేదు. దీంతో ఐదేండ్ల నుంచి పదేండ్ల పిల్లలను నిలోఫర్‌కు రిఫర్ చేస్తుండడంతో ఆ దవాఖానకు ఫ్లో పెరుగుతోంది. డాక్టర్లు లేకపోతే డిప్యూటేషన్, అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరినైనా డాక్టర్ ను నియమించుకుని వైద్య సేవలందించాలి.
కానీ, ఏకంగా డిపార్ట్ మెంట్ నే క్లోజ్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక్కో వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ, బదిలీలతో ఫీవర్హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. మళ్లీ భర్తీ చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం...
పీడియాట్రిక్ డాక్టర్లు లేకనే ఆ విభాగాన్ని మూసివేశాం. ఇటీవలే ఫీవర్ హాస్పిటల్‌కు ఓ పిల్లల డాక్టర్ వచ్చారు. అతి త్వరలోనే పీడియాట్రిక్ విభాగాన్ని మళ్లీ ప్రారంభిస్తాం. పిల్లలకు యథావిధిగా సేవలందిస్తామని ఫీవర్ హాస్పిటల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.