ఆర్థిక సాయం రాలే.. ఆవేదనలో చిల్లర్గి బాధితులు

ఆర్థిక సాయం రాలే.. ఆవేదనలో చిల్లర్గి బాధితులు

పిట్లం : మే 8వ తేదీన నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌ మండలం అన్నాసాగర్‌‌‌‌‌‌‌‌ వద్ద లారీ, మినీట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో పది మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో ఏడుగురు పిట్లం మండలం చిల్లర్గి చెందిన వారు కావడం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదంపై అప్పట్లో ప్రధాని మోడీ సైతం స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ.2లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి ఆర్థిక సాయంతో పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. అయితే రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు ప్రకటించిన రూ.4 లక్షలు రాలేదు. అంత్యక్రియల రోజు ఒక్కో మృతుడికి ఎంపీ బీబీపాటిల్​ అందించిన రూ. 50 వేలు, ఆ తర్వాత పిట్లం లయన్స్ క్లబ్​వారు రూ.10 వేల చొప్పున సాయం చేశారు. మళ్లీ ఇప్పటి వరకు ఆ బాధితులను పట్టించుకున్న వారే లేరు. 

తండ్రి ఉన్నా.. ఒంటరైన నాగలక్ష్మి
ఈమె చౌదర్‌‌‌‌‌‌‌‌పల్లి నాగలక్ష్మి. మే 8న జరిగిన ప్రమాదంలో తల్లి గంగమణి, నానమ్మ వీరవ్వ మృతి చెందగా తండ్రి సాయిలు ( మాజీ సర్పంచ్) వెన్నెముకకు తీవ్ర గాయమైంది. సాయిలుకు నిజామాబాద్ హాస్పిటల్‌‌‌‌లో చికిత్సకు రూ.7 లక్షలు ఖర్చయ్యాయి. చివరకు ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. మంచంపై కదలలేని స్థితిలో ఉన్న ఆయనకు ఇంటి వద్దనే చికిత్స చేయిస్తున్నారు. ఒక్కతే సంతానమైన నాగలక్ష్మి తల్లిని, నానమ్మను కోల్పోయి.. మంచాన పడిన తండ్రికి సేవలు చేస్తూ ఒంటరిదైంది. ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆమె పైచదువుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నా మధ్యలో చదువు ఆపివేయాల్సి వచ్చింది. తండ్రి ఆస్పత్రి ఖర్చుల కోసం బంధువుల వద్ద అప్పు చేయాల్సి వస్తోంది. 

చదువుకునే వయసులో కుటుంబ భారం
ఈ అమ్మాయి పేరు చౌదర్‌‌‌‌‌‌‌‌పల్లి సంధ్య.. అన్నాసాగర్‌‌‌‌‌‌‌‌ వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన వీరమణికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇందులో పెద్ద కుమార్తె సంధ్య ఇంటర్ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతుండగా.. చిన్న కుమార్తె భారతి 8వ తరగతి, కుమారుడు సాయికిరణ్‌‌‌‌ 4వ తరగతి. సంధ్య పరీక్ష టైంలో జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో తల్లితో పాటు నానమ్మ లచ్చవ్వ చనిపోయారు. దీంతో ఆమె ఎగ్జామ్స్‌‌‌‌ రాయలేదు. ఇక కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేసి దుబాయ్‌‌‌‌ వెళ్లిన తండ్రి సాయిలు తప్పని సరి పరిస్థితిలో తిరిగి రావల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కూలి పనులు చేస్తున్నాడు. ఇక సంధ్యే ఇంటి పెద్దదిక్కుగా మారి చెల్లి, తమ్ముడు, తండ్రిని చూసుకుంటోంది.

రూ.3 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే.. 
ఈ చిత్రంలో పాపతో ఉన్న వృద్ధురాలు చౌదర్‌‌‌‌‌‌‌‌పల్లి బాలవ్వ ప్రమాదంలో ఆమె కోడలు శాంతవ్వ తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌‌‌‌లో  ట్రీట్‌‌‌‌మెంట్​పొందుతూ వారం తర్వాత మృతి చెందింది. చికిత్స కోసం మూడు లక్షల అప్పు చేశారు. అయినా ప్రాణం దక్కలేదు. శాంతవ్వకు నలుగురు సంతానం కాగా పెద్ద కుమార్తె వివాహం చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గురిలో చిన్న కుమార్తె మతిస్థిమితం ఉండదు. వారి ఆలనాపాలన చూడడంలో బాలవ్వ అవస్థలు పడుతోంది. మరో వైపు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం చేసిన అప్పు భారంగా మారింది. ప్రమాదంలో స్పాట్‌‌‌‌లో మృతి చెందిన వారికి ఎంపీ బీబీ పాటిల్ రూ. 50 వేల ఆర్థిక సాయం చేయగా శాంతవ్వ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స తీసుకోవడంతో వారికి ఆ సాయం కూడా అందలేదు.  

వివరాలు పంపించాం..
జిల్లా ఆఫీసర్ల ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన, గాయడిన వారి పూర్తి వివరాలు పంపించాం. వారికి రావల్సిన ఆర్థిక సాయం ఇంకా రాలేదు. నిధులు రాగానే అందజేస్తాం. - రామ్మోహన్‌‌‌‌రావు, తహసీల్దార్, పిట్లం