మిరపను తొలుస్తున్న బొబ్బ తెగులు.. తోటల్లో వ్యాపిస్తున్న నల్ల తామర, వైరస్​లు

మిరపను తొలుస్తున్న  బొబ్బ తెగులు..   తోటల్లో వ్యాపిస్తున్న నల్ల తామర, వైరస్​లు
  •     తోటల్లో వ్యాపిస్తున్న నల్ల తామర, వైరస్​లు
  •     తెగులు సోకిన తోటలను దున్నిస్తున్న రైతులు

భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు : జిల్లాలో మిర్చి పంటను తెగుళ్లు, వైరస్​లు పట్టుకున్నాయి. రోజు రోజుకూ ఇది వ్యాపిస్తుండటంతో రైతులు పంటలను దున్నేస్తున్నారు. ఎక్కువ ఆదాయం వస్తుందని వేసిన పంట ఇలా మధ్యలోనే తొలగించి రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 10వేల ఎకరాల్లో బొబ్బ తెగులు, నల్లతామర, ఇతర వైరస్​లు ఆశించాయి.  జిల్లాలో దాదాపు 30వేల ఎకరాల్లో ఈ సీజన్​లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 18వేల ఎకరాల్లో రైతులు మిర్చి  సాగు చేస్తున్నారు.  

కాగా వాతావరణంలో వస్తున్న మార్పులతో బొబ్బ తెగులు, ఎండు తెగులు, రసం పీల్చే పురుగులు, తెల్లదోమ తోపాటు తామర పురుగులు అధికంగా ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని చండ్రుగొండ, సుజాతనగర్​, టేకులపల్లి మండలాల్లో తెగుల్లు, వైరస్​ల వ్యాప్తి రోజుకు పెరుగుతోంది. తెగుళ్లు, వైరస్​లతో మొక్కల ఎదుగుదల ఆగిపోతోంది. మరోవైపు పూత ఆగే పరిస్థితి లేదు. మొక్కల ఆకులు ముడతగా మారి బొబ్బలా పడుతున్నాయి. 

ఆర్థికంగా నష్టం.. 

ఎకరానికి విత్తనాలకు రూ.20 వేలు, దుక్కులకు రూ.25 వేలు, మొక్కలు నాటేందుకు కూలీలకు రూ.5,500, మూడు దఫాలుగా ఎరువులు, క్రిమిసంహారక మందులు స్ప్రే చేసినందుకు దాదాపు రూ.25 వేలను రైతులు పెట్టుబడిగా పెట్టి మిర్చిని సాగు చేశారు. ప్రాథమిక దశలోనే బొబ్బ తెగులుతో పాటు వైరస్​లు మిర్చిని ఆశించడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో తోటలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా కౌలు రైతుల ఆర్థిక పరిస్థితి తెగుళ్లు, వైరస్​లతో మరింత దిగజారింది. 

ఓ వైపు కౌలు చెల్లింపుతో పాటు పెట్టుబడి భారీగా పెట్టడంతో ఆర్థికంగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని సుజాతనగర్​ మండలంలోని తెగుళ్లు, వైరస్​లు ఆశించిన మిర్చి పంటలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు అగ్రికల్చర్​ ఆఫీసర్లు సందర్శించి రైతులకు సూచనలిస్తున్నారు.

జిగురు అట్టలను ఉపయోగించాలె 

మిర్చి పంటను బొబ్బ తెగులుతో పాటు రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, తామర పురుగులు అధికంగా ఆశిస్తున్నాయి. తెగులు, వైరస్​ సోకిన మొక్కలను పీకేయాలి. ఎకరానికి 25 నుంచి 30 వరకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలె. వేపనూనె పిచికారి చేయాలి. థయోమితాక్సాన్​ను ఎకరానికి 60గ్రాముల మేర పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

 - లక్ష్మీనారాయణమ్మ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త 

తెగుళ్లు, వైరస్​ దాడి : రెండున్నర ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. తెగుళ్లు, వైరస్​ దాడితో పంట సగానికి పైగా నాశనం అయింది. ఈ ప్రాంతంలో సాగు చేసిన మిర్చిలో సగం తెగుళ్లు, వైరస్​ దాడితో మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. మిర్చితో ఆదాయం వస్తుందని ఆశిస్తే అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది. 
- నాగేశ్వరరావు, సుజాతనగర్​ మండలం

ప్రత్యామ్నాయ పంట కోసం మిర్చిని తొలగిస్తున్న...


కౌలుకు తీసుకొని రెండు ఎకరాల్లో మిర్చి పంట వేశా. ఎకరానికి రూ.80 వేల వరకు పెట్టుబడులు పెట్టా. ప్రస్తుతం తెల్లదోమ, ఎర్రనల్లి, బొబ్బ తెగులు మిర్చిని సోకింది. మిర్చి మొత్తం పోయింది. తెగుళ్లు, వైరస్​తో పంటంతా దిబ్బతిన్నది. మిర్చి పీకేసి పత్తి లేదా మొక్కజొన్న వేయాలి. ఇప్పటికే కౌలుకు రూ. 50వేలు చెల్లించాలి. కౌలు, పెట్టుబడులతో అప్పులు చేయాల్సి వస్తొంది. 
- బొగ్గుల వెంకటేశ్వరరెడ్డి, చండ్రుగొండ మండలం