గల్వాన్ వ్యాలీ మా ఎల్‌ఏసీ కిందకు వస్తుంది: చైనా

గల్వాన్ వ్యాలీ మా ఎల్‌ఏసీ కిందకు వస్తుంది: చైనా

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన కొన్ని గంటలకు, ఇదే విషయంపై డ్రాగన్ కంట్రీ కూడా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించి ఓ స్టేట్‌మెంట్‌ను చైనా విదేశాంగ శాఖ విడుదల చేసింది. ఇందులో గల్వాన్ వ్యాలీ ఘటన విషయాలను వరుస క్రమంలో పేర్కొంది. ఈ ప్రకటనను చైనా ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ఇండియాలోని చైనా ఎంబసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంచారు. చైనా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో గల్వాన్ లోయపై పలు విషయాలు పేర్కొంది. దీని ప్రకారం ఈస్టర్న్ లడాఖ్‌లోని గల్వాన్ వ్యాలీ.. తమ దేశ భూభాగంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) కిందకు వస్తుందని జావో లిజియాన్ ఆరోపించారు.

గత కొన్నేళ్లుగా చైనా బార్డర్ దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని లిజియాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా తమ సైనికులు ఈ రీజియన్‌లో గస్తీ కాశారని చెప్పారు. అయితే ఎల్‌ఏసీలోని గల్వాన్ లోయలో ఇండియా భద్రతా దళాలు రోడ్లు, బ్రిడ్జుల నిర్మాణం చేపట్టాయని ఆరోపించారు. ‘మే6వ తేదీ పొద్దున ఇండియా దళాలు ఎల్‌ఏసీని దాటి రాత్రికి చైనా భూభాగంలోకి ప్రవేశించాయి. అక్కడ ఓ దుర్గంతోపాటు బారికేడ్లను ఏర్పాటు చేశాయి. దీన్ని గమనించిన చైనా బార్డర్ దళాలు వారిని ఆపడానికి యత్నించాయి. అయితే యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే క్రమంలో వారు కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టారు. అలాగే గల్వాన్ లోయలో పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఈ నెల 15న ఇండియా దళాలు మరోసారి ఎల్‌ఏసీని దాటాలని యత్నించాయి. అలాగే చర్చల కోసం వచ్చిన వారు.. చైనా ఆఫీసర్స్, సైనికులను ఎందుకు చంపారని’ లిజియాన్ విమర్శించారు.