ఇరాన్‌కు మరో దెబ్బ.. IRGC సైనిక వ్యూహకర్త జనరల్ అలీ మహమ్మద్ నైనీ మృతి..

ఇరాన్‌కు మరో దెబ్బ.. IRGC సైనిక వ్యూహకర్త జనరల్ అలీ మహమ్మద్ నైనీ మృతి..

ఇరాన్ యుద్ధం భీకర రూపం దాల్చిన వేళ.. ఇరాన్ సైనిక, రాజకీయ నాయకత్వంపై ఇజ్రాయెల్-అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజా పరిణామాల్లో ఇరాన్ అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికార ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నైనీ శుక్రవారం జరిగిన క్షిపణి దాడిలో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థలు ధృవీకరించాయి. ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడి.. ఇరాన్ రక్షణ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బగా మారింది. ముఖ్యంగా తన మరణానికి కొన్ని గంటల ముందే.. ఇరాన్ క్షిపణి తయారీ పరిశ్రమపై ధీమా వ్యక్తం చేస్తూ నైనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అలీ మహమ్మద్ నైనీ కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు.. ఇరాన్ సైన్యంలో ఒక కీలక వ్యూహకర్త. 1957లో జన్మించిన ఆయన.. ఐఆర్జీసీలో బ్రిగేడియర్ జనరల్ హోదాలో ఉండేవారు. మానసిక యుద్ధతంత్రం, కాగ్నిటివ్ వార్‌ఫేర్‌లో ఆయన నిష్ణాతుడు. 2024లో ఐఆర్జీసీ కమాండర్-ఇన్-చీఫ్ హోస్సేన్ సలామీ ద్వారా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. గతంలో బాసిజ్ బలగాల్లో, ఐఆర్జీసీలో సాంస్కృతిక విభాగం డిప్యూటీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇరాన్ సాఫ్ట్ పవర్ పెంచడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. 

ALSO READ : గాలి నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. చైనా స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ

ఈ వారం ఇరాన్ పాలకులకు అత్యంత గడ్డుకాలంగా మారింది. ఒక్క నైనీ మాత్రమే కాకుండా.. గత కొద్ది రోజుల్లోనే ఇరాన్ టాప్ బ్రాస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. వీరిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, అలీ లారిజానీ, గులాంరెజా సోలేమాని వంటి ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఇస్మాయిల్ ఖతీబ్ గతంలో మాసా అమీని నిరసనల సమయంలో ప్రదర్శనకారులపై అణిచివేత చర్యలకు పాల్పడ్డారని, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్.. అమెరికన్లపై ఉగ్రవాద కార్యకలాపాలకు నాయకత్వం వహించారని ఐడీఎఫ్ ఆరోపించింది. వీరందరి మరణం ఇరాన్ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది.

ఫిబ్రవరి 28న అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు 21వ రోజుకు చేరుకుంది. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దాడులు భవిష్యత్తులో మరిన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలకు దారితీస్తాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. వరుస దాడులతో ఇరాన్ తన సైనిక సామర్థ్యంపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు యుద్ధం తీవ్రత పెరుగుతుంటే.. మరోవైపు ఇరాన్ తనను తాను రక్షించుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయని యుద్ధ నిపుణులు అంటున్నారు.