మమతా మేనిఫెస్టో: ప్రతి కుటుంబానికి ఇల్లు, నిరుద్యోగులకు నెలకు రూ.1500

మమతా మేనిఫెస్టో: ప్రతి కుటుంబానికి ఇల్లు, నిరుద్యోగులకు నెలకు రూ.1500

కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) దూకుడు పెంచింది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ శుక్రవారం (మార్చి 20) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో ‘‘బంగ్లా జొన్నొ దిదిర్ 10 ప్రతిజ్ఞ’’  పేరుతో 10 ప్రధాన హామీలు ప్రకటించింది టీఎంసీ. ఇందులో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు, నిరుద్యోగులకు నెలకు రూ.1500 నిరుద్యోగ భృతి వంటి హామీలు ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టీఎంసీ ప్రకటించిన 10 హామీలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

10 ప్రధాన హమీలు ఇవే:

1. లక్ష్మీర్ భండార్ పథకం కింద బీసీలకు 15 వందలు.. ఎస్సీ, ఎస్టీలకు నెలకు 17 వందల చొప్పున.. ప్రతినెలా డబ్బులు.
2. బంగ్లార్ యువ-సాథి పథకం కింద నిరుద్యోగ యువతకు నెలకు 15 వందల రూపాయలు
3. ప్రతి రైతు ధనవంతుడిని చేసే లక్ష్యంతో.. రైతు బడ్జెట్ ను 30 వేల కోట్ల రూపాయలకు తీసుకెళతామని హామీ.
4. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు.. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అమలు. 
5. ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు. ప్రతి ఇంటికి సర్కార్ నల్లా.
6. వైద్య వాలంటీర్లు. ఇంటింటికీ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ప్రతి వార్డులో దువారే చికిత్స పేరుతో క్లినిక్స్.
7. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దటానికి కట్టుబడి ఉంటాం.
8. లాజిస్టిక్స్, ఓడరేవులు, లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు గ్లోబల్ ట్రేడ్ సెంటర్ల నిర్మాణంతో.. బెంగాల్ రాష్ట్రాన్ని కమర్షియల్ హబ్ గా మారుస్తాం. 
9. వృద్యాప్య ఫించన్లు కొనసాగింపు. అర్హులైన కొత్త వాళ్లకు కార్డులు.
10. పాలన మరింత సమర్థవంతంగా అమలు చేయటానికి కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటు.