టికెట్ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. 2025లో టికెట్ తనిఖీలో రూ.223కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బోర్డు నిర్దేశించిన రూ.221.08కోట్ల లక్ష్యాన్ని 14 రోజుల ముందే అధిగమించింది. గడిచిన పదేళ్లలో టికెట్ చెకింగ్ ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే. ఇంతకు ముందు 2023-24 సంవత్సరం లో రూ . 220.81 కోట్ల ఆదాయం నమోదైంది. టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజీ మొదలైన వాటిపై నమోదైన కేసుల ద్వారా ఈ ఆదాయం గడించింది.
ప్రయాణికుల సౌకర్యాలను మెరుపర్చేందుకు టికెట్ల అమ్మకాలను పెంచేందుకు, బుకింగ్ విండోతోపాటు టికెట్ల జారీకోసం టికెటింగ్ వ్యవస్థలో అనేక డిజిటల్ కార్యక్రమాలను చేపడుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ డిజిటల్ కార్యక్రమాలలో రైల్ వన్ యాప్, బుకింగ్ కౌంటర్ల దగ్గర ఏటీవీఎంలు ,స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌ల ప్రదర్శన వంటివి ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గతంలో ఏ ఆర్థిక సంవత్సరంలో లేనంతగా మొదటిసారిగా టికెట్ తనిఖీలో రూ. 223 కోట్ల ఆదాయాన్ని దాటినందుకు రైల్వే అధికారులు, సిబ్బందిని అభినందించారు. టికెట్ తనిఖీ ఓ పటిష్టమైన యంత్రాంగమని, ఇది అక్రమ రైలు ప్రయాణాలను అరికట్టడంలో సహాయపడుతుందని, అలాగే నిజమైన రైలు ప్రయాణికులలో విశ్వాసాన్ని పెంపొందించడంలో కూడా తోడ్పడుతుందని చెప్పారు.
