కొలంబో: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అగ్రరాజ్యం అమెరికాకు శ్రీలంక ఝలక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు తమ దేశంలో ల్యాండ్ కావడానికి శ్రీలంక అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఆ దేశ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.
జిబూటిలో మోహరించిన రెండు అమెరికా యుద్ధ విమానాలు మార్చి 4, 11 తేదీలలో శ్రీలంకలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి కోరగా ఆ రెండు విజ్ఞప్తులను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఒక్కొ ఫైటర్ జైట్లో ఎనిమిది నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నాయన్నారు. పశ్చియాసియా యుద్ధం వల్ల తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ సమతుల్య విదేశాంగ విధానాన్ని కొనసాగించడానికి శ్రీలంక కట్టుబడి ఉందని తమ వైఖరిని స్పష్టం చేశారు.
అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మా తటస్థ వైఖరిని కాపాడుకోవాలనుకుంటున్నామని.. మేము ఎవరికీ లొంగిపోమని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ ఏకంగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధం వేళ పెద్ద పెద్ద దేశాలే ఎలాంటి వైఖరి ప్రదర్శించకుండా మౌనం వహిస్తుండగా శ్రీలంక మాత్రం నిర్భయంగా తటస్థ వైఖరి ప్రదర్శించడం గమనార్హం.
కాగా, 2026, మార్చి 4న శ్రీలంకలోని గాలే తీరంలో ఇరాన్‌కు చెందిన 'ఐరిస్ డెనా' అనే యుద్ధ నౌకను అమెరికా నేవీ టార్పెడోతో పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 84 మంది నావికులు మరణించగా, మరో 32 మందిని రక్షించారు. ఇరాన్‌కు చెందిన మరో నౌక 'ఐరిస్ బుషెహర్ 219 మంది నావికులతో కొలంబో పోర్టులోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. దీంతో అధికారులు ఆ నౌకను ట్రింకోమలీకి మళ్లించి అక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు.
