
సిద్ధార్థ్ హీరోగా నటిస్తూ నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘చిన్నా’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. ఇటీవల తమిళంలో విడుదలై మెప్పించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ సంస్థ ఈనెల 6న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘ఇది నా లైఫ్ డ్రీమ్ మూవీ. ఇలాంటి గొప్ప చిత్రం చేయడానికి 22 ఏళ్లు పట్టింది.
మణిరత్నం, కమల్ హాసన్ లాంటి నా గురువులు మెచ్చిన చిత్రమిది. నా కెరీర్‌లో బెస్ట్ సినిమా ఇది. ఇంతకంటే గొప్ప సినిమా చేయలేకపోవచ్చు. కచ్చితంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు రిలీజ్ చేశారు. తెలుగులో కూడా గత గురువారమే విడుదల కావాల్సి ఉంది. తెలుగులో... సిద్ధార్థ్ సినిమానా? ఎవరు చూస్తారని అడిగారు. థియేటర్స్ దొరకలేదు.
ఆ సమయంలో నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చిన ఏషియన్ సునీల్ గారికి థ్యాంక్స్’ అన్నాడు. ఏషియన్ మల్టీప్లెక్స్ హెడ్ జాన్వీ మాట్లాడుతూ ‘తమిళంలో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు అరుణ్ కుమార్, రైటర్ కృష్ణకాంత్ పాల్గొన్నారు.