ఒమిక్రాన్ లోకల్ ట్రాన్స్ మిషన్.. చైనాలో లాక్ డౌన్

ఒమిక్రాన్ లోకల్ ట్రాన్స్ మిషన్.. చైనాలో లాక్ డౌన్

బీజింగ్: కరోనా పుట్టిన చైనాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పలు సిటీల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల లాక్ డౌన్ కూడా పెడుతున్నారు. ఇప్పటికే షియాన్, టియాంజిన్ సిటీల్లో లాక్ డౌన్ పెట్టగా.. తాజాగా హెనాన్ ప్రావిన్స్ లోని అన్యాంగ్ సిటీలో లాక్ డౌన్ విధించారు. ఈ మూడు సిటీల్లో లాక్ డౌన్ తో దాదాపు 2 కోట్ల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ సిటీల్లో ఒమిక్రాన్ లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్యాంగ్​లో శనివారం మొదటి కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు 84 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లోనే 58 కేసులు నమోదయ్యాయి. దీంతో అన్యాంగ్ మున్సిపాలిటీ అధికారులు మంగళవారం నుంచి లాక్ డౌన్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. సిటీలోని ప్రతి ఒక్కరికీ టెస్టులు చేస్తున్నారు. కాగా, కేసులు పెరగడంతో మరికొన్ని సిటీల్లో కఠిన ఆంక్షలు విధించారు. హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌలో స్కూళ్లు, రెస్టారెంట్లు క్లోజ్ చేశారు. ఇదే ప్రావిన్సులోని యుజౌ సిటీలో స్టే హోమ్ ఆర్డర్స్ ఇచ్చారు. హాంకాంగ్ సరిహద్దులో ఉన్న షెన్ జెన్​లో కంటైన్ మెంట్ జోన్లు పెట్టారు. కాగా, దేశంలో కొత్తగా 200 కేసులు నమోదయ్యాయని హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇందులో 110 కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్ అని తెలిపింది. ప్రస్తుతం 3,458 మంది ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని  చెప్పింది.