బీజింగ్: చైనాలో శనివారం ఒక్కరోజులోనే 100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో నమోదైన కేసుల్లో ఇదే అత్యంత ఎక్కువ అని, ఇందులో 97 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాల్లో ఉంటున్న చైనీస్ సొంతూళ్లకు వస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. శనివారం వైరస్ కన్ఫామ్ అయిన కేసుల్లో 63 మందికి జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారికి కరోనా పాజిటివ్ ఉందన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో 1,280 మందికి పాజిటివ్ వచ్చిందని, అందులో 481 మంది కోలుకోగా.. 36 మంది కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పారు. చైనాలో ఇప్పటివరకు కన్ఫామ్ అయిన కేసుల సంఖ్య 82 వేలు దాటిందని, వీరిలో 77 వేల మంది కోలుకున్నారని, 3,339 మంది చనిపోయారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. చైనాలో వైరస్ వ్యాప్తి మొదలయినప్పటి నుంచి ఇప్పటిదాకా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 108,862 మందిని చంపేసింది. 17 లక్షల మందికి సోకింది. అమెరికాలో అత్యధికంగా 5,29,887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
