నడి సముద్రంలో కుప్పకూలిన ఖతార్ ఆర్మీ హెలికాప్టర్.. ఆరుగురు మృతి

నడి సముద్రంలో కుప్పకూలిన ఖతార్ ఆర్మీ హెలికాప్టర్.. ఆరుగురు మృతి

దోహా: గల్ఫ్ దేశం ఖతార్‎లో విమాన ప్రమాదం జరిగింది. పర్షియన్ గల్ఫ్ దేశ ప్రాదేశిక జలాల్లో ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా.. ఒకరు గల్లంతైనట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సముద్ర జలాల్లో సైనిక హెలికాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని వెల్లడించింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ సాధారణ విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపింది. 

ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొంది. మిడిల్ ఈస్ట్‎లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం సాగుతోన్న వేళ ఖతార్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలకు సంబంధం లేదని ఖతార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

►ALSO READ | ట్రంప్ వార్నింగ్ లెక్కచేయని ఇరాన్.. అమెరికా యుద్ధ విమానం F-15 కూల్చివేత

ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు సైనికులా లేక సాధారణ పౌరులా అనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి అమెరికా మిత్ర దేశం ఖతార్ పై పలుమార్లు ఇరాన్ దాడులకు పాల్పడింది. ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది.