ట్రంప్ వార్నింగ్ లెక్కచేయని ఇరాన్.. అమెరికా యుద్ధ విమానం F-15 కూల్చివేత

ట్రంప్ వార్నింగ్ లెక్కచేయని ఇరాన్.. అమెరికా యుద్ధ విమానం F-15 కూల్చివేత

ట్రంప్ హెచ్చరిక తర్వాత ప్రత్యర్థి యుద్దవిమానం ఎఫ్-15 ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల అల్టిమేటం ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఎఫ్-15 ను IRGC కూల్చివేసిందని ఇరాన్ మీడియా పేర్కొంది. దేశ దక్షిణ తీరంలోని హోర్ముజ్ ద్వీపం సమీపంలో ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు ఆ ఎఫ్-15 జెట్‌ను అడ్డుకున్నాయని తెలిపింది. 

ఇరాన్ దళాలు ఎఫ్-15 విమానాన్ని ఎలా గుర్తించి, కూల్చివేశాయో చూపిస్తూ టెహ్రాన్ టైమ్స్ మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ ఎక్స్ లో 29 సెకన్ల వీడియోను కూడా విడుదల చేసింది.  నాలుగో తరం యుద్ధ విమానమైన ఎఫ్-15 అమెరికా సైన్యానికి చెందినదా లేక ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (ఐడీఎఫ్) చెందినదా అనేది స్పష్టత లేదు. ఈ రెండు దేశాలు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది . ఇచ్చిన సమయంలోగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవడంలో విఫలమైతే, ఆ ఇరాన్ చమురు కేంద్రాలపై  అమెరికా దాడులు చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. 

►ALSO READ | ఓన్లీ ఇరాన్ శత్రువులకే హార్మూజ్ బంద్: ట్రంప్ డెడ్ లైన్‎కు ఇరాన్ కౌంటర్

ఇంతకుముందు అమెరికాకు చెందిన F35 స్టెల్త్ యుద్ద విమానాన్ని ఇరాన్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.దాదాపు రూ. 830 కోట్ల వ్యయంతో రూపొందించిన  F35 లైట్నింగ్ II ఫైటర్ జెట్ ను దెబ్బతిన్నదని అమెరికా కూడా ధృవీకరంచింది. అయితే పైలట్ క్షేమంగా ఉన్నారని తెలిపింది.  అమెరికా చేస్తున్న వాదన నిజమైతే అది అమెరికా సైన్యానికి కోలుకోలేని దెబ్బ. 

ఇక  యుద్దం ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు చెందిన 16 విమానాలు కూలిపోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు F-15 ఫైటర్ జెట్‌లు కూలిపోగా వాటిలో మూడింటిని కువైట్ దళాలు  పొరపాటున కూల్చివేశాయి. 

అమెరికా గర్వంగా చెప్పుకునే MQ-9 రీపర్ డ్రోన్‌లకు ఈ యుద్ధంలో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులకు వెళ్లిన 12 డ్రోన్‌లను ఇరాన్ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఒక్కో రీపర్ డ్రోన్ విలువ సుమారు రూ.2.5 బిలియన్లు (రూ. 250 కోట్లు). 27 గంటల పాటు నిరంతరాయంగా ఎగురుతూ క్షిపణి దాడులు చేయగల ఈ డ్రోన్‌లు కూలిపోవడం అమెరికాకు పెద్ద దెబ్బ అనే చెబుతున్నారు.