- ఫైనాన్షియల్ సెక్టార్‌కు దూరం.. ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి పతనమే కారణం
- మన కంటే ఆకర్షణీయంగా చైనా, తైవాన్, సౌత్ కొరియా మార్కెట్లు
న్యూఢిల్లీ: ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇండియా స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు. రూపాయి పతనం వలన కిందటేడాది పెద్ద మొత్తంలో షేర్లను అమ్మారు. తాజాగా ఇరాన్– అమెరికా యుద్ధంతో తమ అమ్మకాలను మరింత తీవ్రం చేశారు. ఈ నెల 1–15 తేదీల మధ్య నికరంగా రూ.52,703 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఎక్కువగా ఫైనాన్షియల్ షేర్లను అమ్మారు. దాదాపు రూ.31,831 కోట్ల విలువైన షేర్లను విక్రయించారని అంచనా. రూ.4,807 కోట్ల విలువైన ఆటోమోటివ్ షేర్లను, రూ.3,856 కోట్ల విలువైన టెలికాం షేర్లను అమ్మారు. కన్‌స్ట్రక్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి రంగాలు కూడా గణనీయమైన నష్టాన్ని చూశాయి. సేఫ్టీ ఉండే రంగాలు ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ కూడా అమ్మకాల ఒత్తిడిని తప్పించుకోలేకపోయాయి. అయితే, కొన్ని రంగాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగాయి.
క్యాపిటల్ గూడ్స్ రంగంలో రూ.3,897 కోట్ల ఇన్‌ఫ్లోలు వచ్చాయి. మెటల్స్ అండ్ మైనింగ్, పవర్, కన్స్యూమర్ సర్వీసెస్, కెమికల్స్ వంటి రంగాల్లో కూడా కొంత పెట్టుబడి వచ్చింది. దీనిని బట్టి ఇండియా క్యాపెక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. సాధారణంగా మార్చి నెలలో మార్కెట్‌లు పెరుగుతాయి. కానీ ఈసారి ఇరాన్–అమెరికా యుద్ధం, క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత కారణంగా మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
నిఫ్టీ గత మూడు వారాల్లో 8 శాతం పడిపోయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 14శాతం కంటే ఎక్కువ తగ్గింది, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్ కూడా 12శాతం చొప్పున తగ్గాయి. ఇతర ఆసియా మార్కెట్లు (సౌత్ కొరియా, తైవాన్, చైనా) తక్కువ వాల్యూయేషన్‌తో ఆకర్షణీయంగా కనిపించడం వల్ల భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్లకు ఆసక్తి తగ్గింది. కార్పొరేట్ లాభాలలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తే తప్ప వీళ్లు తిరిగి దలాల్‌స్ట్రీట్‌కు రాకపోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.
రేపు కూడా నష్టాలే ?
ప్రస్తుతం మార్కెట్‌లో బేరిష్ ట్రెండ్ ఉంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు నిఫ్టీ, సెన్సెక్స్ ఇరాన్–అమెరికా యుద్ధం మొదలైన తర్వాత 8–9 శాతం వరకు పడ్డాయి. ఇండెక్స్‌లు హయ్యర్ లెవెల్స్ దగ్గర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ శుక్రవారం ఒక శాతానికి పైగా పడడంతో సోమవారం మార్కెట్ నష్టాల్లో ఓపెన్ అవుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. సెన్సెక్స్ శుక్రవారం 325 పాయింట్లు పెరిగి 74,532.96 వద్ద ముగిసింది.
నిఫ్టీ 112 పాయింట్ల (0.49 శాతం) లాభంతో 23,114.50 వద్ద సెటిలయ్యింది. కానీ, ఈ ఇండెక్స్‌లు ఇంట్రాడేలో ఒక శాతానికి పైగా పెరిగినా, హయ్యర్ లెవెల్స్‌లో సస్టయిన్ కాలేకపోయాయి. అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉందని, కానీ మార్కెట్ ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉందని, రిలీఫ్ ర్యాలీ ఉండొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇరానియన్ ఆయిల్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తేయడంతో క్రూడ్ ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. దీనికితోడు ఇరాన్– అమెరికా యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ సంకేతాలు ఇవ్వడం కూడా పాజిటివ్ అంశం. ఈ న్యూస్‌కు మార్కెట్ స్పందిస్తుందని భావిస్తున్నారు.
