బార్డర్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో మరో మూడు ఊర్లను నిర్మించిన చైనా

బార్డర్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో మరో మూడు ఊర్లను నిర్మించిన చైనా

లడఖ్​బార్డర్ లో మళ్లా మళ్లా కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. అరుణాచల్ బార్డర్ లో కొత్తగా మరో మూడు ఊళ్లను కట్టింది. రోడ్లు, నీళ్లు, కరెంట్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలన్నీ కల్పించి.. అక్కడికి జనాలను కూడా తరలిస్తోంది. భూటాన్, చైనా, ఇండియా ట్రై జంక్షన్ కు దగ్గర్లోని బుమ్ లా పాస్ కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊళ్లు వెలిశాయి. మెల్ల మెల్లగా ఇలాంటి నిర్మాణాలు చేసు కుంటూ.. అరుణాచల్ వైపు భూభాగాన్ని కబ్జా చేయాలన్నది డ్రాగన్ కంట్రీ ప్లాన్ వేస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.  బార్డర్ లో చైనా కొత్త ఊళ్ల విషయాన్ని ‘ప్లానెట్ ల్యాబ్స్’ సంస్థ శాటిలైట్ ఇమేజెస్ తో సహా ఇటీవల బయటపెట్టింది. 2017లో ఇండియా, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ జరిగిన డోక్లాం ఏరియాకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో, బుమ్ లా పాస్ కు 5 కిలోమీటర్లు, అరుణాచల్ లోని తవాంగ్ సిటీకి 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ కొత్త ఊళ్లు వెలిశాయి. ఇక్కడ ఇండియా, చైనా మధ్య బార్డర్ గా మెక్ మోహన్ లైన్ ఉంటుంది. అయితే దీనిని చైనా ఒప్పుకోవడం లేదు. ఈ లైన్ కు ఇవతల ఇండియాలోని 65 వేల చదరపు కిలోమీటర్ల ఏరియా కూడా తమ సౌత్ టిబెట్ రీజియన్ లోనిదేనని వాదిస్తోంది.

ఫిబ్రవరిలో ఒక్కటి.. ఇప్పుడు మరో మూడు

బార్డర్ లో చైనా వైపున ఈ ఏడాది ఫిబ్రవరి17న ఒక్క ఊరు మాత్రమే ఉన్నట్లు శాటిలైట్ ఫొటోల్లో కన్పిస్తోంది. అక్కడ దాదాపు 20 చెక్క ఇండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ 28 నాటి ఫొటోల్లో మాత్రం.. కొత్తగా మరో 3 ఊళ్లు ప్రత్యక్షమయ్యాయి.  దాదాపు 50 కొత్త ఇండ్లు కన్పిస్తున్నాయి. వీటితో పాటు10 ఇండ్లతో మరో కాలనీ కూడా వెలిసింది. వీటన్నింటి మధ్య ఒక్కో కిలోమీటర్ దూరం ఉంది. అన్నింటినీ బీటీ రోడ్లతో కనెక్ట్ చేశారు. తాగునీళ్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా కల్పించారు. ఈ కొత్త ఊళ్ల గురించి చైనా సర్కార్ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కూడా ఓ ఆర్టికల్ రాసింది. ‘షనాన్ ప్రావిన్స్ లో అరుణాచల్ బార్డర్ కు దగ్గరలో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు.. పశువుల పెంపకం పెట్రోలింగ్ డ్యూటీ.. బార్డర్​ను రక్షించడం కోసమే అక్కడ నివసించడం” అని పేర్కొంది. బార్డర్​లో చైనాకు అంత పట్టులేని కోనా కౌంటీ నుంచి 960 కుటుంబాలకు చెందిన 3,222 మందిని ఇక్కడకు  తరలిస్తున్నట్లు కూడా వెల్లడించింది.

పశువుల కాపర్లే ఇన్ ఫార్మర్లు!

‘‘ఇండియా బార్డర్ కు దగ్గర్లో ఊళ్లను కట్టడం.. అక్కడికి హన్ జాతి చైనీయులు, టిబెల్​లోని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులను తరలించడం ద్వారా క్రమంగా బార్డర్​లో మన దేశంవైపు ఆక్రమణలు కొనసాగించాలన్నది చైనా స్ట్రాటజీ” అని ప్రముఖ జియోస్ట్రాటజిస్ట్ డాక్టర్ బ్రహ్మ చెలానీ చెప్తున్నారు. ‘‘దక్షిణ చైనా సముద్రంలో మత్స్యకారులను ఇన్​ఫార్మర్లుగా వాడుకుంటున్నట్లుగానే హిమాలయన్ ఏరియాల్లోనూ పశువుల కాపరులను చైనా వాడుకుంటోంది. మన ఆర్మీ కదలికలను తెలుసుకుంటూ చొరబాట్లకు ప్రయత్నిస్తోంది” అని అన్నారు.