- 80కి పైగా నిర్మిస్తున్న చైనా
- శాటిలైట్ ఫొటోలతో వెలుగులోకి వచ్చిన జిన్‌పింగ్ వ్యూహం
బీజింగ్: తైవాన్ విషయంలో అమెరికాతో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఒకవేళ అమెరికా తమపై దాడికి దిగితే బలంగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాన్ని రెడీ చేస్తున్నారు.
న్యూక్లియర్ మిసైళ్లను కాపాడుకునేందుకు తూర్పు క్సిన్‌జియాన్ ఎడారిలోని హామీ న్యూక్లియర్ మిసైల్ సైలోస్ (భూగర్భ క్షిపణి కేంద్రాలు) ఏరియాలో కొత్తగా 80కి పైగా లాంచ్ ప్యాడ్లు, బంకర్లు, కమ్యూనికేషన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సంచలన విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ 'రాయిటర్స్' తాజాగా ప్రపంచానికి వెల్లడించింది.
చైనాలోని క్సిన్‌జియాన్ ఎడారిలో గత ఆరేళ్లుగా జరుగుతున్న మార్పులను రాయిటర్స్ కమర్షియల్ శాటిలైట్స్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, ఆ శాటిలైట్ ఫొటోల్లో ఉన్న ఆకారాలు దేనికి సంబంధించినవో కచ్చితంగా తెలుసుకోవడానికి ముగ్గురు ప్రముఖ అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులను ఆశ్రయించింది. వారిలో అమెరికాకు చెందిన టోంగ్ జావో, హన్స్ క్రిస్టెన్సన్, హవాయికి చెందిన అలెగ్జాండర్ నీల్ ఉన్నారు.
వీరు చైనా ఎడారికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలను విశ్లేషించినప్పుడు అక్కడ ఉన్నవి సాధారణ కట్టడాలు కావని తేలింది. అవి న్యూక్లియర్ మిసైళ్లను శత్రువుల దాడుల నుంచి రక్షించే బంకర్లు, మొబైల్ మిసైల్ లాంచర్లను నిలిపే కాంక్రీట్ లాంచ్ ప్యాడ్‌లు, మిసైళ్లను గైడ్ చేసే కమ్యూనికేషన్ టవర్లని వారు నిర్ధారించారు.
ఎడారిలో చైనా నిర్మించిన మౌలిక సదుపాయాలివే
శాటిలైట్ ఫొటోల ప్రకారం.. చైనా తన న్యూక్లియర్ సామర్థ్యాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హామీ సైలోస్ నుంచి నైరుతి దిశలో 140, 230 కిలోమీటర్ల దూరాల్లో రెండు భారీ అష్టభుజి (ఆక్టగాన్) ఆకారపు సైనిక స్థావరాలను నిర్మించింది.
ఈ కేంద్రాల నుంచి ఎడారిలోని మట్టి రోడ్ల ద్వారా అనుసంధానించిన రాతి గుట్టలు, ఎండిపోయిన వాగుల మధ్య మొబైల్ మిసైల్ లాంచర్లను నిలిపేందుకు వీలుగా 80 కి పైగా కాంక్రీట్ లాంచ్ ప్యాడ్‌లను సిద్ధం చేసింది. వీటితో పాటు సైనికుల వసతి గృహాలు, వాహనాలను దాచే పటిష్టమైన ఆర్మోర్డ్ బంకర్లు, ఆయుధ రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
రవాణా కోసం రన్‌వేలు, రైల్వే లైన్లను నిర్మించడమే కాకుండా, లాప్ నూర్ ప్రాంతంలో నకిలీ యుద్ధ విమానాల బొమ్మలతో టార్గెట్ ప్రాక్టీస్ కోసం ఒక ప్రత్యేక మిలిటరీ ట్రైనింగ్ ఏరియాను కూడా చైనా సిద్ధం చేసింది.
