ఏంటి సామి ఇదీ : అర గంటలో 5 కిలోమీటర్ల పరిగెత్తలేదు.. ఉద్యోగం పీకేశారు

ఏంటి సామి ఇదీ : అర గంటలో 5 కిలోమీటర్ల పరిగెత్తలేదు.. ఉద్యోగం పీకేశారు

ఈ రోజుల్లో ఉద్యోగాలు.. గాల్లో దీపంలా మారాయి. కరోనా తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. అంతేకాదు.. సోషల్ మీడియా ప్రభావం, చాట్‌జీపీటీ, ఇతరాత్ర టెక్నాలజీల వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఐటీ రంగంలో జాబ్స్ మరింత దయనీయంగా మారాయి. అలాగే కొన్ని కంపెనీలు ఉద్యోగుల చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చూపిస్తూ జాబ్ నుంచి పీకేస్తున్నాయి. తాజాగా చైనాలోని ఓ సంస్థ ఉద్యోగులు పరిగెట్టలేకపోయారనే చిన్న కారణంతో సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. అదేంటీ, పరిగెట్టకపోయినా ఉద్యోగం నుంచి తీసేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? ఔనండి, వాళ్లు అదే చేశారు. దానికి కారణం కూడా చెప్పారు. 

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ సిటీలో నివసిస్తున్న మిస్టర్ లియు అనే వ్యక్తి ఓ మెకానికల్ పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యం అతడికి వివిధ విభాగాల్లో పరీక్షలు పెట్టింది. ఎలక్ట్రికల్, గ్యాస్ కట్టింగ్ పరీక్షల్లో అతడు ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడు ఆ పరిశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఎంతో సంతోషంగా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. మెయింటెనెన్స్ విభాగంలో పనిచేయడం ప్రారంభించాడు. అయితే, కంపెనీలో ఉద్యోగంలో పర్మినెంట్ కావాలంటే ఇంకో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే విషయం అతడికి తెలీదు. అదే, పరుగు పందెం. 

ఔనండి రన్నింగ్ రేసే. ఉద్యోగి 30 నిమిషాల్లో 3 మైళ్లు ఆగకుండా పరిగెడితేనే సంస్థలో కొనసాగుతారు. లేకపోతే, పీకేస్తారు. ఈ విషయం విన్న తర్వాత లియుకు నోటి నుంచి మాట రాలేదు. ‘‘తాను పోలీస్, సైన్యం లేదా విపత్తుల నివారణ విభాగంలో పనిచేయడం లేదు కదా? ఎందుకు ఈ రన్నింగ్ రేస్’’ అని తన పై అధికారులను ప్రశ్నించాడు లియు. ఇందుకు  పై అధికారులు సమాధానంగా.. ‘‘నువ్వు ఫిట్‌గా ఉన్నావో లేదో మాకు ఎలా తెలుస్తుంది? నీ ఆరోగ్యం కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం చూపకూడదంటే.. నువ్వెంత ఫిట్‌గా ఉన్నావు? పని చేయగలవా లేదా అని తెలుసుకోవాలి’’ అని అన్నారు. దీంతో లియు షాకయ్యాడు. 

మిట్టమధ్యాహ్నం.. ఎండలో పరుగు

సరిగ్గా మిట్టమధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో అతడికి రన్నింగ్ టెస్ట్ నిర్వహించారు. 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే లియు ఫిట్‌గానే ఉన్నా.. .. పరిగెత్తే  అలవాటు లేదు. దీంతో నిర్ణీత సమయంలో ఆ పరుగును పూర్తి చేయలేకపోయాడు. దీంతో యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆగ్రహానికి గురైన లియు కోర్టును ఆశ్రయించాడు. తనని ఉద్యోగం నుంచి అకారణంగా తొలగించారంటూ కంపెనీపై దావా వేశాడు. ఉద్యోగంలో చేరడానికి ముందు  తనకు వైద్య పరీక్షలు చేశారని, దానికి కూడా తన సొంత డబ్బులే చెల్లించానని వెల్లడించాడు. అయినా సరే వారు తనని పరిగెట్టించారని వాపోయాడు.  కోర్టు కూడా లియూ  వాదనలు సరైనదని అంగీకరించింది ... జరిమానాగా లియుకు రూ. 82,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.