ఉల్కాపాతం కాదు.. చైనా రాకెట్ కూలే దృశ్యాలు

ఉల్కాపాతం కాదు.. చైనా రాకెట్ కూలే దృశ్యాలు

హమ్మయ్యా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 23 టన్నుల బరువు ఉండే చైనాకు చెందిన లాంగ్ మార్చ్-5B Y3 క్యారియర్ రాకెట్‌ కు  చెందిన భారీ శకలాలు హిందూ మహాసముద్రంలో పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తూర్పు,ఆగ్నేయాసియా దేశాల ప్రజలు ఈ దృశ్యాలను ఉల్కాపాతంగా భ్రమించి వీడియోలు తీసుకొన్నారు. శనివారం రాత్రి 10.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా స్పేస్‌ కమాండ్‌ విభాగం కూడా ఈవిషయాన్ని నిర్ధారించింది.  కాగా,  చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్ ను నిర్మిస్తోంది. ఇందుకు అవసరమైన మాడ్యూళ్లను లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ ద్వారా తరలిస్తోంది. తాజాగా ఈ రాకెట్ ద్వారా మాడ్యూళ్లను అంతరిక్ష కేంద్రానికి తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయే సందర్భంలో లోపం తలెత్తింది. దీంతో రాకెట్ నియంత్రణ కోల్పోయి హిందూ మహాసముద్రంలో పడింది.  

తూర్పు,ఆగ్నేయాసియాలోని వేలాది మంది రాత్రి ఆకాశంలో ఆకట్టుకునే అద్భుతమైన ప్రదర్శనను చూశారు.ఇది ఉల్కాపాతం అని భావించి చాలా మంది కెమెరాలను క్లిక్ మనిపించారు. చైనీస్ రాకెట్ మలేషియా మీదుగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ శకలాలు ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ కూడా షేర్‌ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉంటాయనేది తెలియాల్సి ఉందన్నారు.   

మరోవైపు చైనా స్పేస్‌ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నిల్సన్‌ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్‌ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలుగజేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.