చైనాలో కరోనాపై ట్వీట్​ చేసిన వ్యక్తి.. మూడేండ్ల తర్వాత విడుదలైండు

చైనాలో కరోనాపై ట్వీట్​ చేసిన వ్యక్తి.. మూడేండ్ల తర్వాత విడుదలైండు


హాంగ్‌‌కాంగ్‌‌: చైనాలో కరోనా వ్యాపిస్తున్న సమయంలో అక్కడి పరిస్థితులపై వీడియోలను తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేసిన వ్యక్తి మూడేండ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే, ఇప్పుడు ఆ వ్యక్తిని విడుదల చేయడానికి చైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అతని బంధువులు, ఈ కేసు గురించి తెలిసిన మరో వ్యక్తి వెల్లడించారు. ఫాంగ్‌‌ బిన్‌‌తో పాటు సిటిజన్‌‌ జర్నలిస్టులుగా పిలిచే మరికొందరు వ్యక్తులు 2020 ప్రారంభంలో దేశంలో కరోనా వ్యాప్తితో అక్కడి హాస్పిటళ్లలో పరిస్థితులు, డెడ్‌‌బాడీల వీడియోలను తీసి ఇంటర్నెట్‌‌, సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారు.

దీంతో ఆ వీడియోలు అప్పట్లో బాగా వైరల్‌‌ అయ్యాయి. వైరస్‌‌ను అదుపు చేయడంలో చైనా ప్రభుత్వం విఫలమైందంటూ ప్రజలు, ఇతర దేశాల నుంచి పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సంప్రదాయ చైనీస్‌‌ దుస్తులు విక్రయించే ఫాంగ్‌‌ ఈ వీడియోలపై స్పందిస్తూ, ‘‘ప్రభుత్వానికి ఎదురు తిరగండి. ప్రజలకు తిరిగి అధికారం ఇవ్వండి” అంటూ ట్విట్టర్‌‌‌‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌‌పై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం అతన్ని అరెస్ట్‌‌ చేసింది. మూడేండ్లు జైలులో ఉంచినట్లు తెలిసింది. తాజాగా అతను ఆదివారం విడుదల అయినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు.