V6 News

దలైలామాపై గూఢచర్యం చేస్తున్న మహిళ అరెస్ట్

దలైలామాపై గూఢచర్యం చేస్తున్న మహిళ అరెస్ట్

బౌద్ధమత గురువు దలైలామా పై గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న చైనా మహిళను బీహార్‭లోని గయా జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తిరిగి చైనాకు పంపించే అవకాశం ఉంది. బీహార్ జిల్లాలో దలైలామా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నందున ఈరోజు తెల్లవారుజామున స్థానిక పోలీసులు భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. అనుమానిత చైనీస్ గూఢచారి, సాంగ్ జియావోలాన్‌గా గుర్తించబడిన మహిళ ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఆమె గురించి తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారు. 

అనుమానిత చైనీస్ గూఢచారి బుద్ధగయాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక సంవత్సరానికి పైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, చైనా మహిళ బస గురించి ఎటువంటి సమాచారం లేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల తర్వాత బుద్ధగయాలో పర్యటించేందుకు దలైలామా వచ్చారు. మూడు రోజుల పాటు సాగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. దలైలామా పర్యటన కారణంగా పోలీసులు భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు. ఇక దలైలామా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బీహార్‭కు చేరుకున్నారు.