
9 ఏండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశారు?
రాష్ట్ర సర్కార్‌కు బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్న
హైదరాబాద్, వెలుగు : తొమ్మిదేండ్లలో హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సిటీ డెవలప్‌మెంట్ కోసం రూ.లక్ష కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న బీఆర్ఎస్ సర్కార్.. ఆ నిధులను ఏం చేశారని నిలదీశారు. ఇందులో 30 శాతం ‘కే ట్యాక్స్’(కల్వకుంట్ల ట్యాక్స్)కే పోతుందని ధ్వజమెత్తారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. సిటీలో 80 లక్షల జనాభా ఉంటే, అందులో 20 లక్షల మందికి తాగు నీరును ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. రెండు సెంటీమీటర్ల వర్షం పడితేనే సిటీ మునిగిపోతుందని, ఇక అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఫైర్ అయ్యారు. దేశంలో ఇతర సిటీలతో పోల్చితే హైదరాబాద్ జనాభా ఎక్కువని, కానీ జీహెచ్ఎంసీ బడ్జెట్ మాత్రం చాలా తక్కువేనన్నారు.