చిట్టీల పేరుతో మోసం.. దంపతులకు జైలు..పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు

చిట్టీల పేరుతో మోసం.. దంపతులకు జైలు..పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు

పద్మారావునగర్, వెలుగు: చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతులకు ఏడాది జైలు శిక్ష పడింది. చిలకలగూడ ఏసీపీ శశాంక్​రెడ్డి, ఎస్‌‌‌‌హెచ్​వో అనుదీప్‌‌‌‌ వివరాల ప్రకారం.. పార్శిగుట్టకు చెందిన డి.రవీందర్, సుజాత దంపతులు. 2015లో ఇంటివద్ద చిట్టీల వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో తక్కువ మొత్తాలకు చిట్టీలు వేసి సకాలంలో డబ్బులు చెల్లించి  స్థానికుల్లో నమ్మకం సంపాదించారు. ఆ తర్వాత పెద్దమొత్తంలో చిట్టీలు ప్రారంభించి ఎక్కువ మందిని చేర్చుకున్నారు.

 గడువు ముగిసినప్పటికీ చిట్టీ డబ్బులు చెల్లించకుండా అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ఆశ పెట్టారు. దాదాపు 40 మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, పరారయ్యారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. 

పదేండ్ల కేసు విచారణ తర్వాత సికింద్రాబాద్‌‌‌‌19వ అడిషనల్‌‌‌‌ చీఫ్​జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అరుణ గురువారం తీర్పు వెలువరించారు. మోసానికి పాల్పడిన దంపతులకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 500 జరిమానా విధించారు.