
ఆంధ్ర ప్రదేశ్.. విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ హై స్కూల్ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చేశారు రెవెన్యూ అధికారులు. కొన్నాళ్ల క్రితం హైస్కూలుకు ఆనుకుని ఉన్న స్థలాన్ని కొందరు కొన్నారు. అయితే కొద్ది రోజులకు వారి స్థలంతో పాటు స్కూల్ స్థలాన్ని కూడా ఆక్రమించి బిల్డింగ్ ను కట్టారు. ఇందుకు వ్యతిరేకంగా..విశాఖ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఏజీ శర్మ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోని ఆక్రమణదారులు.. గతేడాది స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు.
గవర్నమెంట్ స్కూల్ స్థలంలో.. అక్రమంగా కట్టిన నిర్మాణాలను తొలగించకుండా.. ప్రహారీ ఎలా నిర్మిస్తారని మరో మారు హైకోర్టులో కేసు వేశారు ఏజీ శర్మ. దీంతో హైస్కూల్ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను మూడు నెలల్లో తొలగించాలని ఈ ఏడాది జనవరి 31న రెవెన్యూ అధికారులను ఆదేశించింది హైకోర్టు. దీంతో పోలీసుల సహాయంతో ఈ రోజు అక్రమకట్టడాన్ని తొలగించారు రెవెన్యూ అధికారులు.