అక్రమాలకు పాల్పడిన చౌటుప్పల్ తహశీల్దార్ సస్పెండ్

అక్రమాలకు పాల్పడిన చౌటుప్పల్ తహశీల్దార్ సస్పెండ్
  • తహశీల్దార్ గిరిధర్ తోపాటు డిప్యూటీ మమత,  సీనియర్ అసిస్టెంట్ జానయ్యలపై కూడా సస్పెన్షన్ వేటు

యాదాద్రి జిల్లా:  ధరణి రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడిన రెవెన్యూ  అధికారులపై అధికారులు కొరడా ఝుళిపించి సస్పెన్షన్ వేటు వేశారు. చౌటుప్పల్ తాహశీల్దార్ కె.గిరిధర్,  డిప్యూటీ తహశీల్దార్ మమత,  సీనియర్ అసిస్టెంట్ జానయ్య లను  సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే ఆరోపణలు వెల్లువెత్తినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకంపై సానుకూల ప్రచారం కోసం ప్రభుత్వం ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రెవెన్యూ అధికారులు అవకాశంగా తీసుకుని యధేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారు. అయితే చౌటుప్పల్ లో జరిగిన అక్రమాలపై బాధితులు సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ స్పందించి సస్పెన్షన్ వేటు వేశారు.