మొన్న ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ ఆర్డర్..నిన్న క్యాన్సిల్‌‌‌‌ మెసేజ్‌‌‌‌

మొన్న ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ ఆర్డర్..నిన్న క్యాన్సిల్‌‌‌‌ మెసేజ్‌‌‌‌
  • మహబూబాబాద్​ జిల్లాలో సీఐల బదిలీల్లో గందరగోళం
  • కొత్త పోస్ట్‌‌‌‌లో ఛార్జ్‌‌‌‌ తీసుకోకముందే ట్రాన్స్‌‌‌‌ఫర్ అంటూ మరో మెసేజ్‌‌‌‌
  • హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా మారిన సీఐల బదిలీలు

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో ఇటీవల జరిగిన సీఐల ట్రాన్స్‌‌‌‌ఫర్లలో గందరగోళం నెలకొంది. సీఐలను ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేస్తూ ఇటీవల ఆర్డర్స్ జారీ చేసిన ఆఫీసర్లు, ఆ ఆర్డర్స్‌‌‌‌ను క్యాన్సిల్‌‌‌‌ చేస్తున్నట్లు రెండు రోజుల్లోనే మెసేజ్‌‌‌‌ పంపించారు. దీంతో సీఐలు కొత్త సర్కిల్‌‌‌‌లో చార్జ్‌‌‌‌ తీసుకోకముందే మరో చోటికి బదిలీ కావాల్సి వచ్చింది.

చార్జ్‌‌‌‌ తీసుకోకముందే ట్రాన్స్‌‌‌‌ఫర్

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని 9 మంది సీఐలను ట్రాన్స్‌‌‌‌ఫర్ చేస్తూ ఈ నెల 8న మల్టీ జోన్‌‌‌‌ ఐజీ తరుణ్‌‌‌‌ జోషి ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో ఐదు పోలీస్‌‌‌‌ స్టేషన్లకు కేటాయించిన సీఐలు కొత్త ప్లేస్‌‌‌‌లో చార్జ్‌‌‌‌ తీసుకోకముందే ట్రాన్స్‌‌‌‌ఫర్ ఆర్డర్సను రద్దు చేయడంతో పాటు వారి ప్లేస్‌‌‌‌లలో కొత్త సీఐలకు పోస్టింగ్‌‌‌‌ ఇచ్చారు. అయితే రివైజ్డ్ కాపీని మొదట బహిర్గతం చేయకుండా సీఐలకు ఫోన్‌‌‌‌ ద్వారా సమాచారం ఇచ్చిన ఆఫీసర్లు, సోమవారం రాత్రి అఫీషియల్‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు.

 గతంలో ట్రాన్స్‌‌‌‌ఫర్లు జరిగిన టైంలో ఒకరిద్దరికి మాత్రమే ఈ పరిస్థితి ఉండేదని ప్రస్తుతం ట్రాన్స్‌‌‌‌ఫర్ అయిన సీఐలందరిని మార్చడం పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారులు సైతం స్పందించడం లేదు. మొదట ట్రాన్స్‌‌‌‌ఫర్లు జరిగింది వాస్తవమేనని, ఆ తర్వాత మార్పులు ఎలా జరిగాయి అనే విషయంపై ఐజీ ఆఫీస్‌‌‌‌లోనే సంప్రదించాలని చెబుతున్నారు. 

పోస్టింగ్ దక్కించుకున్న గంటల్లోనే ఆశల ఆవిరి

ట్రాన్స్‌‌‌‌ఫర్, పోస్టింగ్‌‌‌‌ ఆర్డర్ వచ్చిన సీఐలు చార్జ్‌‌‌‌ తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ లోపే ‘మీరు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే ఉండండి, మీరు బదిలీ అయిన స్థానాలు మార్చబడినవి, వివరాల కోసం ఆఫీస్‌‌‌‌లో సంప్రదించండి’ అని మెసేజ్‌‌‌‌ రావడంతో సీఐలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే పోలీస్‌‌‌‌ శాఖలో ప్రక్షాళన, పారదర్శకత కోసమే ఈ విధానం అవలంభించారా ? లేక ఆయా నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి పాత ట్రాన్స్‌‌‌‌ఫర్లు రద్దు చేసి, కొత్తవి ఇచ్చారా ? అని జిల్లాలో చర్చ జరుగుతోంది. 

ట్రాన్స్‌‌‌‌ఫర్లలో జరిగిన మార్పులు

తొర్రూరు సీఐగా తొలుత ఫణిధర్‌‌‌‌ను కేటాయించగా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టి.సంజీవ్‌‌‌‌ను నియమించారు. దీంతో ఆయన సోమవారం తొర్రూరులో చార్జ్‌‌‌‌ తీసుకున్నారు. మరిపెడ సీఐగా మొదట పెండ్యాల దేవేందర్‌‌‌‌ను కేటాయించగా ఆయన స్థానంలో కొత్తగా హతీరాం పేరు ప్రకటించారు. అలాగే మహబూబాబాద్‌‌‌‌ రూరల్‌‌‌‌ సీఐగా మంగిలాల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో సర్వయ్య, మహబూబాబాద్‌‌‌‌ టౌన్ సీఐ బాలాజీ వర ప్రసాద్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో దేవేందర్‌‌‌‌ను, గూడూరు సీఐ చంద్రమౌళి ప్లేస్‌‌‌‌లో కొత్తగా బానోతు రాజును రీప్లేస్‌‌‌‌ చేస్తూ ఆదేశాలను జారీ చేశారు. 

డ్యూటీలో చేరేదాక నమ్మకం ఉండడం లేదు 

పోలీస్‌‌‌‌ శాఖలో గతంలో ఎన్నడూ లేని విధానాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ఆర్డర్‌‌‌‌ కాపీ చేతికి వచ్చినా డ్యూటీలో చేరే వరకు నమ్మకం ఉండడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేయాల్సి వస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సిన్సియర్‌‌‌‌ ఆఫీసర్లకు గుర్తింపు లేకుండా పోతోంది. సిఫార్సులకే ప్రయారిటీ ఇస్తున్నారు.

ఓ సీఐ, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా