- వాటి డేటా కలెక్ట్ చేస్తున్న సీఐడీ
- 92 మంది విదేశాలకు వెళ్లినట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు : ఫేక్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్ట్‌లు పొందిన కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆదిలాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచే ఎక్కువ సంఖ్యలో పాస్‌పోర్టులు పొందినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ట్రావెల్ ఏజెంట్లతో స్లాట్లు బుక్ చేయించినట్లు ఆధారాలు సేకరించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎలాంటి వెరిఫికేషన్ చేయలేదని ఎంక్వైరీలో తేలింది. ఈ మేరకు ఆయా కమిషనరేట్ల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
కేసులో అరెస్ట్ అయిన కానిస్టేబుల్స్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు తెలిసింది. వీరికి సహకరించిన మరికొంత మంది పోలీస్ అధికారులపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఫేక్ ఆధార్, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్షియల్ ప్రూఫ్స్‌తో శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి పాస్‌పోర్టులు ఇప్పించిన 12 మందిని రాష్ట్ర సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, కరీంనగర్ ఫేక్ అడ్రెస్‌లతో
హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, కరీంనగర్, జగిత్యాలలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్, చెన్నై ఏజెంట్, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను మరో 8 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు.108 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.92 మంది విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టులు పొందిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు.
హైదరాబాద్, కరీంనగర్ అడ్రెస్‌లతో ఎక్కువ పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించారు. పాస్‌పోర్టులో జారీ అయిన అడ్రెస్‌లలో ఆ పేర్లతో ఎవ్వరూ లేనట్లు ఎంక్వైరీలో తేలింది. నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టులు తీసుకున్న వారి వివరాలు, సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండేండ్లుగా ఎన్ని పాస్‌పోర్ట్‌లు తయారు చేశారనే కోణంలో సీఐడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
