సింగరేణిలో మెడికల్​ బోర్డుపై కొనసాగుతున్న సీఐడీ ఎంక్వైరీ

సింగరేణిలో మెడికల్​ బోర్డుపై కొనసాగుతున్న సీఐడీ ఎంక్వైరీ
  • సీఎండీ ఆదేశాల మేరకు రంగంలోకి.. ​
  • ఎనిమిది బృందాలుగా విడిపోయి నెల రోజులుగా దర్యాప్తు 
  • ఇప్పటివరకు అన్​ఫిట్​అయినోళ్లు 14వేల మందికి పైనే.. 
  • రూ. 450 కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు  
  •  దళారుల్లో మొదలైన టెన్షన్..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​ కంపెనీలో ఇన్వాలిడేషన్​(మెడికల్​బోర్డు)ద్వారా అక్రమ పద్ధతుల్లో నియామకాలు పొంది న వారిపై సీఐడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. సింగరేణి వ్యాప్తంగా ఎనిమిది సీఐడీ బృందాలు విచారణ నిర్వహిస్తుండడంతో దళారుల్లో వణుకు మొదలైంది. గురువారం కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​లో సీఐడీకి చెందిన పలువురు ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ హాస్పిటల్​లో నెలకు ఒకసారి, కొన్ని సందర్భాల్లో నెలకు రెండు సార్లు మెడికల్​ ఫిట్​నెస్​ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇలా ఇప్పటివరకు మెడికల్ ​బోర్డు పరీక్షల్లో సుమారు14వేల మంది కార్మికులు అన్​ఫిట్ ​కాగా, వీరి తర్వాత వీరి వారసులకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో దళారులు, అధికారులు, సిబ్బంది కలిసి దాదాపు రూ.450 కోట్ల వరకు దండుకున్నారన్న ప్రచారం కార్మికవర్గాల్లో సాగింది. దీంతో స్పందించిన సింగరేణి సీఎండీ  బలరాం నాయక్​ విచారణ చేయాలని సీఐడీకి లెటర్ రాశారు. దీంతో దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. 

దళారులు చిక్కేనా...

మెడికల్ ​బోర్డులో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు ఇప్పటివరకు అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్​ మూడు నెలల కింద సీఐడీ ఎంక్వైరీ కోరారు. దీంతో మెడికల్ ​బోర్డులో చక్రం తిప్పుతున్న దళారులు, అక్రమాలకు పాల్పడుతున్న ఆఫీసర్లు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్​తో పాటు పలు యూనియన్​లీడర్ల ప్రమేయంపై సీఐడీ దృష్టి సారించింది. సింగరేణిలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, ఆర్జీ–1,2,3తో పాటు మరికొన్ని ఏరియాల్లో ఎనిమిది సీఐడీ బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు ఆఫీసర్లు ఉండగా.. ఎనిమిది బృందాలు ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ చేసుకుంటూ పని చేస్తున్నాయి. ఇప్పటికే కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ​హాస్పిటల్ ​నుంచి ఇన్వాలిడేషన్ ​అయిన వారి వివరాలతో పాటు మెడికల్​బోర్డుకు అప్లై చేసిన వారి డిటెయిల్స్ ​కూడా తీసుకున్నట్టు సమాచారం.  

రెండు దశల్లో ఎంక్వైరీ...

సింగరేణి వ్యాప్తంగా మెడికల్​బోర్డులో జరిగిన అవినీతిపై సీఐడీ బృందాలు చేస్తున్న ఎంక్వైరీతో దళారులను హడలిపోతున్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలో వరంగల్ ​రేంజ్​ సీఐడీ బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. మొదటి దశలో అన్​ఫిట్​అయిన కార్మికుల వద్దకు వెళ్లి విచారణ జరుపుతున్న సీఐడీ, రెండో దశలో అన్​ఫిట్​ కాకుండా ఫిట్​ఫర్​ జాబ్​అయిన వారిని ఎంక్వైరీ చేయనున్నట్టు తెలిసింది. విచారణలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా పలు పోలీస్​ స్టేషన్లలో మెడికల్​బోర్డు దందాపై నమోదైన కేసుల వివరాలను తెలుసుకుంటున్నారు. సింగరేణిలోని ఇంటెలిజెన్స్​ విభాగంలో పనిచేసిన పలువురిని కూడా విచారించినట్టు సమాచారం.  

కాసులు కురిపిస్తున్న మెడికల్​ బోర్డు 

సింగరేణి కాలరీస్​ కంపెనీలో ఇన్వాలిడేషన్​ దళారులకు కాసుల వర్షం కురిపిస్తొంది. అనారోగ్య సమస్యలతో డ్యూటీ చేయలేని వారిని మెడికల్​ బోర్డు అన్​ఫిట్​గా ప్రకటిస్తే వారి వారసులకు ఉద్యోగాలు వస్తాయి. అయితే, కొంతమంది అన్​ఫిట్ ​కాకపోయినా, ఎలాంటి అనారోగ్యం లేకపోయినా వారి వారసులకు ఉద్యోగాలు ఇప్పించుకోవడం కోసం మెడికల్​బోర్డుకు వస్తుంటారు. ఇక్కడి నుంచే దళారుల దందా మొదలవుతోంది. కార్మికులను అన్​ఫిట్​చేయించడానికి లక్షల్లో దండుకుంటున్న దళారులు..మెడికల్ ​బోర్డులోని ఆఫీసర్లు, సిబ్బందికి తలా ఇంత ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కార్మికుడి నుంచి రూ. 5లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. 

అన్​ఫిట్ ​కోసం దరఖాస్తు చేస్తున్న కార్మికుల సంఖ్యను బట్టి మెడికల్ ​బోర్డు నిర్వహిస్తారు. కొన్ని సందర్బాల్లో నెలకు రెండు నుంచి మూడు మెడికల్ ​బోర్డులు జరిగిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి దాదాపు 150 నుంచి  200 మంది కార్మికులను యాజమాన్యం మెడికల్ ​బోర్డుకు పిలుస్తుంది. ఇందులో దాదాపు 120 నుంచి 150 మందికి పైగా అన్​ఫిట్​అవుతున్నారు. ఇలా అన్​ఫిట్ ​అయిన వారిలో దాదాపు 75శాతం మంది  దళారులకు పైసలిచ్చిన వారేనన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దళారుల్లో మెయిన్​ హాస్పిటల్​లో పనిచేసే ముఖ్యమైన వారితో పాటు హెడ్డాఫీస్​, మైన్స్​లో పనిచేసే కొందరు ఆఫీసర్లు, ఉద్యోగులు, బీఆర్ఎస్​ తత––లీడర్లు, టీబీజీకేఎస్​తో పాటు పలు యూనియన్​ లీడర్లు ఉన్నట్టుగా సీఐడీ అధికారులు గుర్తించారు.