కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు సీఐఐ గ్లోబల్ అవార్డు

కాకా బీఆర్ అంబేద్కర్  విద్యాసంస్థలకు సీఐఐ గ్లోబల్ అవార్డు
  • ఢిల్లీలోని ఇండియన్ హాబిటేట్ సెంటర్​లో ఘనంగా అవార్డుల ఫంక్షన్
  •     ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో ఉత్తమ ఇన్​స్టిట్యూట్​గా నిలిచిన విద్యా సంస్థ 
  •     అవార్డు అందుకున్న సంస్థ చైర్మన్ గడ్డం వివేక్, కరస్పాండెంట్ సరోజ
  •     కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో ఉత్తమ ఇన్​స్టిట్యూట్​గా నిలిచిన విద్యా సంస్థ 
  • అవార్డు అందుకున్న సంస్థ చైర్మన్
  • వివేక్, కరస్పాండెంట్ సరోజ

న్యూఢిల్లీ, వెలుగు:
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గ్లోబల్ సమిట్ లో కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో కాకా బీఆర్​ అంబేద్కర్ విద్యాసంస్థలు ఉత్తమ ఇన్​స్టిట్యూట్ గా నిలిచాయి. శుక్రవారం ఢిల్లీలోని ఇండియన్ హాబిటేట్ సెంటర్ లో ‘ఇండస్ట్రీ- అకాడమియా పార్టనర్ షిప్ –-2025’ అజెండాతో సీఐఐ గ్లోబల్ సమిట్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఇందులో కాకా బీఆర్ అంబేద్కర్‌‌ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గడ్డం సరోజ, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా విద్యా, పరిశ్రమలు, సర్వీస్, ఇతర రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు సీఐఐ అవార్డులను ప్రదానం చేసింది. మ్యాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్, పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో గోల్డ్, డైమంట్, ప్లాటినం పేరుతో మొత్తం 10 కేటగిరీలో అవార్డులను అందజేసింది. ఇందులో ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో‌‌ కాకా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్స్ (అటానమస్-, న్యాక్ అక్రెడేటెడ్)కు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూట్ అవార్డు దక్కింది. సీఐఐ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలు, ఇతర ప్రముఖల చేతుల మీదుగా ఇన్​స్టిట్యూట్స్​ చైర్మన్, మంత్రి వివేక్ వెంకట స్వామి, కరస్పాండెంట్ డాక్టర్ గడ్డం సరోజ అవార్డులను అందుకున్నారు. 

ఈ ఘనత స్టూడెంట్స్​దే..

గోల్డ్ కేటగిరీలో కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్స్ కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని సంస్థ కరస్పాండెంట్ గడ్డం సరోజ అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు తమ ఇన్​స్టిట్యూట్స్ గొప్ప అవకాశం కల్పిస్తున్నదని తెలిపారు. 80 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులకు కాకా బీఆర్ అంబేడ్కర్ ఇన్​స్టిట్యూట్స్ లో ఉచితంగా విద్యనందిస్తున్నట్టు చెప్పారు. ఈ వర్గాలకు చెందిన ఆరు వేల మంది విద్యార్థులు ఇన్​స్టిట్యూట్ లో చదువుకుంటున్నట్లు వెల్లడించారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్   తమ కాలేజీ పూర్వ విద్యార్థులని ఆమె గుర్తు చేశారు. ఇక్కడ చదువుకున్న వారెందరో పొలిటీషియన్స్ గా, జూనియర్ సివిల్ జడ్జీలుగా, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు. వారందరి తరఫున ఈ అవార్డును అందుకున్నట్లు చెప్పారు. ఇండియా టుడే సర్వేలో కాకా బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ దేశంలోనే ఐదో స్థానం, తెలంగాణలో రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. న్యాక్ లో డిగ్రీ కాలేజీకి ఏ గ్రేడ్, తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క న్యాక్ అక్రిడేటెడ్ లా కాలేజ్ గా తమ విద్యాసంస్థ గుర్తింపు పొందిందన్నారు. 

ఈ సర్వేలో బీ ప్లస్ ప్లస్ మార్క్ సాధించిన ఘనత విద్యార్థులదేనన్నారు. విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాలే సంస్థను జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిలుపుతున్నాయని చెప్పారు. సీఐఐ అవార్డు తమ బాధ్యతను పెంచిందన్నారు. జూనియర్ కాలేజ్ కి ప్రతియేటా దాదాపు నాలుగు స్టేట్ ర్యాంక్ లు దక్కుతున్నాయని, మరిన్ని ర్యాంక్ లు సాధించడంతోపాటు దేశ ఉన్నత పదవులను తమ స్డూడెంట్స్ అధిరోహించాలని డాక్టర్​ సరోజ ఆకాంక్షించారు.