ఆర్టీఏ ఆఫీసులో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా.. 10మంది అరెస్టు

ఆర్టీఏ ఆఫీసులో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా.. 10మంది అరెస్టు

వరంగల్: ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు డొంక కదిలిస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అడ్డంగా దోచుకుంటున్నట్లు తేలింది. అక్రమార్కులు ఆర్టిఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళాలుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేసి స్మార్ట్ కార్డులను అమ్ముతున్నారు. మోసపోయిన పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు సర్టిఫికెట్స్ మార్ఫింగ్ చేస్తున్న జిరాక్స్ సెంటర్స్ పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ మేరకు మిల్క్ కానీ పోలీసు స్టేషన్ లో నకిలీ ఇన్స్యూరెన్స్ పత్రాలు  తయారు చేస్తున్న, స్మార్ట్ కార్డులను అమ్ముతున్న 10 మందిపై కేసులు నమోదు చేశారు.

నిందితుల్లో మామిడి రాజు, ఉమ్మడి నిఖిల్, నాగమల్ల శివ ప్రసాద్, అల్లడి రాజేష్ గుండెబోయిన శ్రీకాంత్ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరు దళారులు రాజకుమార్, బొల్లినేని సుమన్ఆర్టిఏ కార్యాలయంలో డీబీఏలుగా  పనిచేస్తున్న శ్రీనివాస్, రఘు తోపాటు గతంలో పనిచేసిన సునీల్ పరారయ్యారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న కంప్యూటర్ సెంటర్స్ నుంచి పెద్ద ఎత్తున నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, స్మార్ట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశాం: పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
నకిలీ వాహన‌ బీమా పాలసీలు చేసే  ముఠా గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు రెండు ముఠాలకు చెందిన ఇద్దరు దళారులతోపాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితులను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులు నకిలీ పత్రాలు ఎలా సృష్టించి చెలామణి చేశారో వివరించారు. మొబైల్ యాప్ ద్వారా  డాక్యుమెంట్లు డౌన్ లోడ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా దొరకకుండా ఫేక్ భీమా పాలసీలు, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ తయారు చేస్తారు. ఈవిధంగా రెండేళ్లలో 90 లక్షల రూపాయల విలువ చేసే 2 వేల నుంచి పది వేల  డాక్యుమెంట్లు తయారు చేశారని, అయితే వీరి బారిన పడి మోసపోయిన వాహనదారుడి ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించడంతో పది మంది పట్టుబడ్డారని సిపి తరుణ్ జోషి తెలిపారు. నిందితుల నుంచి 4లక్షల 46వేల రూపాయల నగదు, 3 ల్యాప్ టాప్ లు, 2 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, 433 వాహన ఆర్సీలు, లైసెన్స్ కార్డులు, రబ్బర్ స్టాంప్ లు, నకిలీ భీమా పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.