మిడ్‌‌ డే మీల్స్‌‌ స్కీమ్​పై కుట్ర : సీఐటీయూ

మిడ్‌‌ డే మీల్స్‌‌ స్కీమ్​పై కుట్ర : సీఐటీయూ

హైదరాబాద్, వెలుగు : మిడ్‌‌ డే మీల్స్‌‌ స్కీమ్-ను కార్పొరేట్-కు అప్పగించాలనే కుట్ర జరుగుతోందని సీఐటీయూ ఆల్ ఇండియా సెక్రటరీ ఏఆర్ సింధు ఆరోపించారు. శుక్రవారం బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా మిడ్‌‌ డే మీల్స్‌‌ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ రెండో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు ఎస్. వరలక్ష్మీ సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ​సింధు మాట్లాడుతూ.. దేశంలో లక్షలాది మంది  పిల్లలు  పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మరింత పెరిగిందన్నారు. మిడ్‌‌ డే మీల్స్‌‌ స్కీమ్-తో స్కూళ్లలోని లక్షలాది మంది చిన్నారులతో పాటు కార్మికులు కూడా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. కానీ మోడీ సర్కారు ఈ స్కీమ్-ను కూడా కార్పొరేట్-కు అప్పగించి.. కార్మికుల పొట్టకొట్టాలని యత్నిస్తోందని మండిపడ్డారు.

ఈ  స్కీమ్​ను కాపాడుకోవాలని సూచించారు. దేశంలోని 11.70 లక్షల స్కూళ్లల్లో  మిడ్‌‌ డే మీల్స్‌‌ స్కీం అమలవుతోందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. ఈ స్కీమ్​ అమలులో భాగమైన మధ్యాహ్న భోజన కార్మికులకు చట్టప్రకారం కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు, అంగన్ వాడీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు ఉషా, ఆశా వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు సురేఖ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు,  మిడ్‌‌ డే మీల్స్‌‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రపాణి, ఎస్వీ రమ పాల్గొన్నారు.