గాడినపడ్డ ఇండిగో..1,650 విమానాలను నడిపిన సంస్థ..ప్యాసింజర్లకు రూ.610 కోట్లు రీఫండ్

గాడినపడ్డ ఇండిగో..1,650 విమానాలను నడిపిన సంస్థ..ప్యాసింజర్లకు  రూ.610 కోట్లు రీఫండ్

 

  • 1,650 విమానాలను నడిపిన సంస్థ.. మరో 650 ఫ్లైట్లు రద్దు 
  • ఒక్కటి మినహా అన్ని రూట్లలో సర్వీసులు స్టార్ట్  
  • ఈ నెల 10 కల్లా విమానాలన్నీ నడిపిస్తామని వెల్లడి 
  • ప్యాసింజర్లకు ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్

న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభం కొలిక్కి వస్తున్నది. ఐదారు రోజులుగా వందలాది విమానాలను రద్దు చేసిన ఆ సంస్థ.. మెల్లిగా గాడిన పడుతున్నది. ప్రతిరోజు 2,300 ఫ్లైట్లను నడిపే ఇండిగో.. ఆదివారం 1,650 ఫ్లైట్లను నడిపింది. 650 విమానాలను రద్దు చేసింది. గురువారం 500కు పైగా, శుక్రవారం దాదాపు 1,500, శనివారం 800కు పైగా విమానాలను రద్దు చేయగా.. ఆదివారం చాలా వరకు సర్వీసులను పునరుద్ధరించింది. 138 రూట్లకు గాను 137 రూట్లలో ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించామని ఇండిగో వెల్లడించింది. ఈ నెల 10 కల్లా పూర్తి స్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ‘‘పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. శనివారం 1,500 ఫ్లైట్లను నడపగా, ఆదివారం 1,650 ఫ్లైట్లను నడిపినం. మేం తీసుకుంటున్న చర్యలతో సమస్య కొలిక్కి వస్తున్నది. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి” అని పేర్కొంది. దశల వారీగా పరిస్థితులను చక్కదిద్దుకుంటూ తాము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నామని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. కాగా, ఆదివారం దేశవ్యాప్తంగా 650 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ముంబైలో 112, ఢిల్లీలో 109, కోల్‌‌‌‌కతాలో 76, హైదరాబాద్‌‌‌‌లో 61 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది.

ప్రయాణికులకు రీఫండ్.. 

ప్యాసింజర్లకు ఇప్పటి వరకు రూ.610 కోట్ల రీఫండ్‌‌‌‌ను ఇండిగో చెల్లించినట్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే 3 వేల లగేజీ బ్యాగ్‌‌‌‌లను ప్రయాణికులకు తిరిగి అందజేసినట్టు తెలిపింది. ‘‘రద్దయిన, ఆలస్యమైన విమానాలకు సంబంధించి శనివారం వరకు రూ.610 కోట్ల రీఫండ్‌‌‌‌ను ప్యాసింజర్లకు ఇండిగో చెల్లించింది. 3 వేల లగేజీ బ్యాగ్‌‌‌‌లను తిరిగి అప్పగించింది. రీషెడ్యూలింగ్ ఫ్లైట్లకు సంబంధించి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. రీఫండ్, రీబుకింగ్ కోసం ప్రత్యేక సెల్స్ 
ఏర్పాటు చేసింది” అని ప్రకటనలో పేర్కొంది.

పార్లమెంటరీ కమిటీ సీరియస్ 

ఇండిగో సంస్థకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఈ అంశాన్ని ట్రాన్స్‌‌‌‌పోర్ట్, టూరిజం అండ్ కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సీరియస్‌‌‌‌గా తీసుకుంది. ఈ సమస్యకు సంబంధించి ఇండిగో సహా డీజీసీఏ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి కూడా వివరణ కోరనున్నట్టు కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. విమానాల రద్దు, అధిక చార్జీల కారణంగా పలువురు ఎంపీలు సైతం ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో లేదా జ్యూడీషియల్ విచారణ గానీ జరిపించాలని సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. కాగా, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌‌‌‌కు డీజీసీఏ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. 
విమానాల రద్దుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సీఎంజీ ఏర్పాటు.. 

సంస్థలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు క్రైసిస్ మేనేజ్‌‌‌‌మెంట్ గ్రూప్ (సీఎంజీ)ను ఏర్పాటు చేసినట్టు ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్‌‌‌‌‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది. ఇందులో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా, డైరెక్టర్లు గ్రెగ్ సారెట్స్కి, మైక్ విటేకర్, అమితాబ్ కాంత్, సీఈవో పీటర్ ఎల్బర్స్ ఉన్నారని పేర్కొంది. ఈ గ్రూప్ తరచూ సమావేశమవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నదని తెలిపింది. విమాన సర్వీసుల పునరుద్ధరణకు, రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి ప్యాసింజర్లకు చెల్లించాల్సిన రీఫండ్‌‌‌‌ వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటున్నదని చెప్పింది.