హైదరాబాద్ లో నాలుగు చోట్ల సివిల్​ డిఫెన్స్​ మాక్​ డ్రిల్స్​ అభ్యాస్​​ సక్సెస్

హైదరాబాద్ లో నాలుగు చోట్ల సివిల్​ డిఫెన్స్​ మాక్​ డ్రిల్స్​ అభ్యాస్​​ సక్సెస్
  • ఉత్సాహంగా పాల్గొన్న జనం.. అత్యవసర పరిస్థితిపై అవగాహన
  • సుమారు 30 జనావాస ప్రాంతాల్లోనూ అవగాహన
  • సాయంత్రం 4 గంటలకుమోగిన సైరన్లు​
  • జనాల్ని అలెర్ట్ చేసిన పోలీసులు, అధికారులు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బుధవారం సిటీలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో నిర్వహించిన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్​ విజయవంతంగా జరిగాయి. సికింద్రాబాద్, కంచన్‌‌బాగ్ డీఆర్‌‌డీఓ, నాచారం ఎన్‌‌ఎఫ్‌‌సీ, గోల్కొండలో ఈ డ్రిల్స్ ​కొనసాగాయి. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించిన డ్రిల్స్ లో  ఫైర్, లా అండ్​ఆర్డర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్​, జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్​, హెల్త్​తోపాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కలిపి 1,200 మంది, 800 మంది ఎన్​సీసీ, ఎన్ఎస్ఎస్ ​క్యాడెంట్లు పాల్గొన్నారు.  

2 నిమిషాలు మోగిన సైరన్లు..

సాయంత్రం 4 గంటలకు నగరవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఈ సైరన్లు శత్రుల దాడిని సూచిస్తాయని, వీటితో జనాల్ని అలర్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అని పోలీసులు, ఇతర శాఖల అధికారులు తెలిపారు. రెండు నిమిషాల పాటు పోలీసులు లౌడ్‌‌ స్పీకర్లు, అగ్నిమాపక వాహనాలు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా సైరన్లు వినిపించారు. ఆయా గేటెడ్​ కమ్యూనిటీలు, జంక్షన్లలో అధికారులు సైరన్లు మోగిస్తూ, మాక్​డ్రిల్ ​నిర్వహించారు.

అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వివరించారు. మాక్​ డ్రిల్స్​లో ప్రమాద తీరును, గాయపడ్డ వారిని తరలించడం, ప్రథమ చికిత్స అందించడం, జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి ఎలా చేయాలో చూపించారు. ఐటీ కారిడార్​లోని సైబర్​టవర్స్, మైండ్​స్పేస్, అయ్యప్ప సొసైటీ, మణికొండ, గచ్చిబౌలి చౌరస్తా, విప్రో, ఐఐఐటీ జంక్షన్లు, నల్లగండ్ల నియో పోలీస్​మాల్​, లింగంపల్లి రైల్వే స్టేషన్​, మియాపూర్ లో అధికారులు మాక్​డ్రిల్​ చేపట్టారు. మెహిదీపట్నంలోని నానల్ నగర్ లో నిర్వహించిన మాక్​డ్రిల్​లో కలెక్టర్​అనుదీప్, కార్వాన్ నాంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మాజీద్ హుస్సేన్, అధికారులు పాల్గొన్నారు.