హైకోర్టు కొత్త బిల్డింగ్​లకు శంకుస్థాపన .. భూమిపూజ చేసిన డీవై చంద్రచూడ్

హైకోర్టు కొత్త బిల్డింగ్​లకు శంకుస్థాపన .. భూమిపూజ చేసిన డీవై చంద్రచూడ్
  • హైకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జిలు హాజరు  

హైదరాబాద్, వెలుగు :  కోర్టుల్లో అన్ని సౌలతులు ఉం టేనే సత్వర న్యాయం అందించేందుకు వీలవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్టుల్లో ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రస్తుతం దిగువ కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లోనూ సౌలతులు సరిగ్గా లేవని సుప్రీంకోర్టుకు అందిన నివేదికలోనే తేలిందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌ మండలం బుద్వేలులో వంద ఎక రాల్లో నిర్మించనున్న హైకోర్టు నూతన భవనాలకు బుధ వారం సీజేఐ జస్టిస్‌‌ చంద్రచూడ్‌‌ శంకుస్థాపన చేశారు.

 అనంతరం ఆయనతో పాటు హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌‌ పీఎస్‌‌ నర్సింహ, జస్టిస్‌‌ పీవీ సంజయ్‌‌కుమార్, జస్టిస్‌‌ ఎస్‌‌వి భట్టి భూమిపూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత వేదికపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా రూ. 7 వేల కోట్లతో ప్రారంభించిన ఇ–కోర్టుల మూడో దశలో భాగంగా 31 జిల్లాల్లోని 32 ఈ–-సేవా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. కోర్టుల్లో టాయిలెట్లు సరిగ్గా లేక ఉదయం ఇంటి నుంచి వస్తే సాయంత్రం ఇల్లు చేరేవరకు ఆడవాళ్లకు వాష్‌‌రూంకు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. మరుగుదొడ్లు, బిడ్లకు తల్లులు పాలు ఇవ్వడానికి ప్రత్యేక గదులు, చిన్న పిల్లలు ఉంటే ఉయ్యాలల వంటి కనీస వసతులు అవసరమన్నారు.  

ప్రభుత్వాన్ని అభినందించాలి: జస్టిస్ పీఎస్ నరసింహ 

ప్రస్తుత హైకోర్టు భవనం నిజాం కాలం నాటిదని, వందేండ్లు దాటిన ఆ భవనంలో జడ్జిలకు చాంబర్లు కూడా లేకపోవడంతో లాన్ లో సమావేశాలు నిర్వహిం చుకునే పరిస్థితి ఉందని జస్టిస్ పీఎస్ నరసింహ అన్నా రు. తాను గతంలో తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా పని చేశానని, జడ్జిలతోపాటు అడ్వకేట్లకు మౌలిక వసతులు ఉంటే మరింత ఉత్సాహంగా పని చేస్తారని అనిపించేదన్నారు. ఇప్పుడు కొత్త భవనాలతో ఆ సమస్యలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేశారు.  

అందరికీ ఉపయోగపడేలా భవనాలు: సీజే అలోక్ అరాధే 

కోర్టులు అన్ని వసతులతో సిద్ధంగా ఉంటే వేగవంతంగా, పారదర్శకంగా కేసులు పూర్తి చేయవచ్చని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. హైకోర్టు కొత్త భవనాలు పర్యావరణ హితంగా, ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్లు, అడిషనల్‌‌ సొలిసిటర్‌‌ జనరల్‌‌(ఏఎస్‌‌జీ) నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్‌‌ జనరల్‌‌(డీఎస్‌‌జీ) గాడి ప్రవీణ్‌‌కుమార్, అడ్వకేట్‌‌ జనరల్‌‌(ఏజీ) సుదర్శన్‌‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌‌ఖాన్, 
తేరా రజనీకాంత్‌‌రెడ్డి, హెచ్‌‌సీఏఏ అధ్యక్షుడు, హైకోర్టు పీపీ పల్లె నాగేశ్వర్‌‌రావు, సీఎస్‌‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.