కూల్చివేతలు, బెదిరింపులపై.. జడ్జీలు వాయిస్ వినిపించాలి: సీజే చంద్రచూడ్

కూల్చివేతలు, బెదిరింపులపై.. జడ్జీలు వాయిస్ వినిపించాలి: సీజే చంద్రచూడ్
  • కేసు ఎవరిదైనా ప్రజలకు న్యాయం చేయాలి
  • సమస్యలుంటే వ్యక్తిగతంగా కలిస్తే పరిష్కరిస్త

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను జడ్జిలు బలోపేతం చేయాలని, చట్టపరమైన ప్రక్రియ, స్వతంత్రత, సమగ్రతపై నమ్మకం కలిగించేలా ప్రవర్తించాలని సుప్రీం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని న్యాయవాదులను కోరారు. అవి కోర్టు బయటికి వెళ్లనివ్వకుండా చూసుకోవాలన్నారు. ఏకపక్ష అరెస్ట్​లు, బెదిరింపులు, కూల్చివేతలు, ఆస్తులను చట్టవిరుద్ధంగా అటాచ్ చేస్తే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ వాయిస్​ వినిపించాలని జడ్జీలను ఉద్దేశిస్తూ సూచించారు. 

కేసు ఎవరిది అయినా.. ప్రజలకు న్యాయం అందించాలన్నారు. అప్పుడే జ్యుడీషియల్ సిస్టమ్ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి ఒక్కరికీ నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమక్షంలోనే.. ఫలానా కేసు అని ప్రస్తావించకుండా బుల్డోజింగ్​పై (కూల్చివేతలపై) సీజేఐ చేసిన పరోక్ష కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయి. సుప్రీం కోర్టు ఆవరణలో మంగళవారం సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీజేఐ స్పెషల్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 76 ఏండ్ల భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్ర.. సామాన్య ప్రజలకు పోరాట చరిత్ర అని అన్నారు. న్యాయం పొందడంలో ఉన్న అడ్డంకులను తొలగించడం, జ్యుడీషియల్ సిస్టమ్​ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. లైన్​లో ఉన్న చివరి వ్యక్తిని కూడా కలుపుకుని పోయే రోడ్​మ్యాప్.. న్యాయ వ్యవస్థకు ఓ సవాల్ అని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. 

కుటుంబ పెద్దగా బాధ్యత అప్పగించారు

సమస్యలను సోషల్ మీడియాలో పెట్టడం కంటే.. తనను వ్యక్తిగతంగా కలిస్తే పరిష్కరిస్తానని జడ్జీలు, అడ్వకేట్లను ఉద్దేశిస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్ హామీ ఇచ్చారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులమని, కంప్లైంట్​లు పట్టుకుని కోర్టు బయటికి పరుగెత్తకుండా దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించాలన్నారు. సుప్రీం కోర్టులో అదనంగా 27 అడిషనల్ కోర్టు రూమ్​లు, 4 రిజిస్ట్రార్ కోర్టు రూమ్​లు, అడ్వకేట్ల కోసం మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని తెలిపారు.