మాతృ దేశాన్ని మరవద్దు

మాతృ దేశాన్ని మరవద్దు

మాతృ మూర్తి, మాతృ భాష, మాతృ దేశాన్ని మరవద్దని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్ తమిళి సై ముఖ్యఅతిథులుగా హాజరైయ్యారు. అనంతరం గవర్నర్ తమిళిసై సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఠాగూర్, నెహ్రూ, అంబేద్కర్ వంటి ఎందరో గొప్ప నేతలు డాక్టరేట్ పొందిన ఓయూ నుంచి తాను డాక్టరేట్ అందుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, సీఎం కేసీఆర్ కూడా ఉస్మానియా ప్రొడక్టులేనన్నారు. 

తాను ఓయూ లా కాలేజీలో చేరాలనుకున్నానని, అయితే తనకు ఆ అవకాశం దక్కలేదని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో చైతన్యవంతమైన విద్యా కేంద్రమన్నారు. మూలాలు మర్చి పోతే చరిత్ర, జాతి క్షమించదన్నారు. తెలంగాణపై దాశరథి, కాళోజీల కవిత చదివిన ఎన్వీ రమణ.. విద్యార్థులు తమ జీవితాల్లో పైకి రావాలి ఆకాంక్షించారు. చివరగా తమిళంలో గవర్నర్ కు రొంబ థాంక్స్ అంటూ సీజేఐ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. ఓయూ కాన్వకేషన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విజయానికి షార్ట్ కట్స్ లేవని, హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ కు సీక్రెట్ అని తెలిపారు. రాత్రిళ్ళు ఏ టైం వరకు చదివినా.. ఉదయం మాత్రం త్వరగా మేలుకోవాలన్నారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని విద్యార్థులకు సలహానిచ్చారు. సాధారణంగా ఉంటూనే అసాధారణ విజయాలు సాధించాలని కోరారు. ఇప్పుడున్న స్థితిలో 5 నిమిషాలు కూడా సెల్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదన్న గవర్నర్... అమ్మ నాన్నలు, గురువులను మరిచి ప్రతిదానికి గూగుల్ లో వెతుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పెద్ద  లక్ష్యాలను పెట్టుకోవాలని, అందకోసం గట్టిగా కష్టపడాలని సూచించారు. చివరగా గురుజాడ కవిత్వంతో గవర్నర్ తన ప్రసంగం ముగించారు.