ఆఖరి వర్కింగ్ డేలో ఐదు కేసులు విచారణ

 ఆఖరి వర్కింగ్ డేలో ఐదు కేసులు విచారణ

ఆఖరి పని దినాన..  ఐదు కేసులు

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సీజేఐగా ఆఖరి వర్కింగ్ డేలో ఐదు కేసులను విచారించారు. కొత్త సీజేఐగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ హిమాకోహ్లీతో కలిసి కేసుల విచారణ చేపట్టారు. అయితే, సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కోర్టు ప్రొసీడింగ్స్ ను శుక్రవారం లైవ్ లో ప్రసారం చేయడం విశేషం. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) వెబ్ క్యాస్ట్ పోర్టల్ ద్వారా కోర్టు విచారణలు లైవ్ స్ట్రీమ్ అయ్యాయి.  

ఉచిత హామీల కేసు త్రీ జడ్జి బెంచ్​కు రిఫర్​

రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడాన్ని అడ్డుకోవాలంటూ అశ్వనీ ఉపాధ్యాయ్ వేసిన పిల్​పై శుక్రవారం సీజేఐ బెంచ్ విచారణ జరిపింది. ఈ కేసులో ‘ఏవి ఉచితం? ఏవి సంక్షేమం? అన్నది తేల్చడం కష్టం’ అన్న కోర్టు.. దీనికోసం ఎక్స్​పర్ట్​ కమిటీని నియమించాలని అభిప్రాయపడింది. తాజాగా త్రీ జడ్జి బెంచ్​కు రిఫర్ చేస్తూ సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. 

కర్నాటక మైనింగ్ కేసు 

కర్నాటకలో ఇనుప ఖనిజం మైనింగ్ లిమిట్స్​ను సుప్రీంకోర్టు పెంచింది. బళ్లారి జిల్లాలో 28 మిలియన్ టన్నుల వరకు పరిమితి ఉండగా, దానిని 35 మిలియన్ టన్నులకు పెంచుతూ సీజేఐ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తుమకూరు, చిత్రదుర్గ జిల్లాల్లో 7 మిలియన్ టన్నులుగా ఉన్న సీలింగ్​ను 15 మిలియన్ టన్నులకు పెంచారు. ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయొద్దని కర్నాటక ప్రభుత్వం ఏప్రిల్​లో సుప్రీంకోర్టును కోరింది. కానీ ఈ మూడు జిల్లాల్లో ఎగుమతులు చేసుకోవచ్చని మే నెలలో కోర్టు అనుమతినిచ్చింది. 

బ్యాంక్రప్టీ కోడ్.. కస్టమ్స్ యాక్ట్ 

ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్(ఐబీసీ) కింద మారటోరియాన్ని ప్రకటించిన తర్వాత కస్టమ్స్ యాక్ట్ అధికార పరిధి తగ్గిపోతుందని సీజేఐ బెంచ్ స్పష్టంచేసింది. ఐబీసీ డిక్లేర్ అయిన తర్వాత బకాయిలను రికవరీ చేసుకునేందుకు కస్టమ్స్ యాక్ట్ కింద చర్యలు చేపట్టే వీలులేదని ప్రకటించింది. 

యోగి ప్రాసిక్యూషన్​కు నో 

గోరఖ్ పూర్​లో 2007లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రాసిక్యూట్ చేయాలంటూ యాక్టివిస్ట్ పర్వేజ్ పర్వాజ్ దాఖలు చేసిన పిటిషన్​ను సీజేఐ బెంచ్ డిస్మిస్ చేసింది. 2007, జనవరి 27న హిందూ యువ వాహిని సభలో యోగి ప్రసంగం చేయడంతో అల్లర్లు జరిగాయని, అందువల్లే ఓ వ్యక్తి చనిపోయారంటూ పిటిషనర్ ఆరోపించారు. 

రాజస్థాన్ మైనింగ్ లీజ్ కేసు 

అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజును రద్దు చేయాలంటూ రాజస్థాన్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్​ను సీజేఐ జస్టిస్ రమణ బెంచ్ శుక్రవారం విచారించింది. ఈ లైమ్ స్టోన్ మైనింగ్ ప్రాంతం ఒక జలాశయం పరిధిలో ఉందని, అక్కడ పర్యావరణం దెబ్బతింటుందన్న ప్రభుత్వ వాదనను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

సీజేఐగా కీలక కేసుల్లో తీర్పు  

సీజేఐగా జస్టిస్ రమణ ఏప్రిల్ 24, 2021న ప్రమాణం చేశారు. ఆ తర్వాత వారంలోనే యూపీలోని హత్రాస్​లో బాలిక గ్యాంగ్ రేప్, హత్య కేసును కవర్ చేసేందుకు వెళ్తున్న జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్​ను పోలీసులు అరెస్ట్ చేయడానికి సంబంధించిన కేసును విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించినా.. సిద్దిఖ్​ను ఢిల్లీకి తరలించి, మెరుగైన ట్రీట్ మెంట్ అందేలా చూడాలని సీజేఐ ఆదేశించారు. అలాగే బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం (ఐపీసీ సెక్షన్ 124ఏ) వ్యాలిడిటీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ నూ ఆయన విచారించారు.