ఢిల్లీలో సీజేపీ ఆందోళన..స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్ కు డిమాండ్..పోలీసుల హామీతో విరమించిన లీడర్లు

ఢిల్లీలో సీజేపీ ఆందోళన..స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్ కు డిమాండ్..పోలీసుల హామీతో విరమించిన లీడర్లు
  • పోలీసుల హామీతో విరమించిన లీడర్లు
  • సాయంత్రం యూపీలో భరద్వాజ్ అరెస్ట్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శుక్రవారం మరోసారి ఆందోళన నిర్వహించింది. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల సమయంలో ఓ విద్యార్థి తండ్రిపై దాడి చేసిన స్వతంత్ర భరద్వాజ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట సీజేపీ ప్రతినిధులు గుమిగూడారు. ఈ ఆందోళనలో ఎంపీలు చంద్రశేఖర్ ఆజాద్, పప్పు యాదవ్ కూడా విద్యార్థులకు అండగా ఉన్నారు. 

విద్యార్థులు, నేతలు కలిసి పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో భరద్వాజ్ ను 72 గంటల్లో అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సీజేపీ నేతలు వెనక్కి తగ్గారు. అనంతరం, భరద్వాజ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఉత్తరప్రదేశ్​లో నిందితుడి కదలికలను గుర్తించారు. యూపీ పోలీసుల సాయంతో బులంద్‌‌‌‌షహర్ జిల్లా ధమ్రా నారా గ్రామం సమీపంలో భరద్వాజ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

జులై 20న జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో విద్యార్థిని నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌‌‌‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి భరద్వాజ్ ఓ పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సంజయ్ కుమార్​పై తానే దాడి చేసి తల పగలగొట్టానని భరద్వాజ్ అందులో గొప్పగా చెప్పుకోవడం పెను దుమారం రేపింది.