
మిషన్ భగీరథకు ఎక్కువ నిధులు కేటాయించలేమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇంజినీరింగ్ అద్భుతాలు నిర్మించాలనుకోవడం సరికాదన్నారు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇంజినీరింగ్ అద్భుతాలు ఎక్కువ నిలబడలేవన్నారు. రాష్ట్రాలకు తాము ఇవ్వాలనుకున్న మేరకే ఇస్తామన్నారు. అంతకుమించి కావాలనుకుంటే అది రాష్ట్రాల ఇష్టమని.. సొంత నిధులతో చేసుకోవచ్చని చెప్పారు షెకావత్. ఏపీ, తెలంగాణ కంటే నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయన్నారు.
నీటి పారుదలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం చొరవ చూపాలని చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ ఎస్కే జోషి అటెండ్ అయ్యారు.