చలో నల్లగొండ Vs చలో కాళేశ్వరం

చలో నల్లగొండ Vs చలో కాళేశ్వరం

హైదరాబాద్: రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ రూటు మార్చుకుంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని  ప్రాజెక్టులపై అధికారాన్ని వదలులుకొని తెలంగాణను తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఈ నెల 13న చలో నల్లగొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ఒప్పందాలను ప్రజలకు వివరిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాళేశ్వరం బండారాన్ని బయటపెట్టేందుకు సర్కారు రెడీ అయ్యింది. అదే 13వ తారీఖున అఖిల పక్ష పార్టీలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యింది. 

గోదావరి బేసిన్ లో నిర్మించిన అతి పెద్ద ఎత్తిపోతల పథకంలో లక్ష  కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్లలో  ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇటీవలే విజిలెన్స్ విచారణ చేయించిన రాష్ట్ర ప్రభుత్వం లోపాలను  ఎత్తి చూపింది. నిర్మాణం, నిర్వహణ అంతా లోప భూయిష్టంగా విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. కీలక అంశాలను నివేదికలో పొందు పర్చింది. 

దీంతో వాటిని అన్ని పార్టీల నాయకులకూ చూపించేందుకు కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్లనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ టైమ్ ను ఒక రోజు ముందు జరిపే అవకాశం ఉంది. అంటే ఈ నెల 12నే అసెంబ్లీ సెషన్ క్లోజ్ చేస్తారని తెలుస్తోంది.