తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేయగా..ఇద్దరికి గాయాలయ్యాయి. బాత్రూమ్ వెళ్లేందుకు దారి ఇవ్వమని గుంటూరు భక్తులు అడగగా.. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. తమిళనాడు భక్తులు ఎక్కువ ఉండడంతో గుంటూరు భక్తులపై దాడికి దిగారు.  మిగితా భక్తులు సర్దిచెప్పినా వినకుండా తమిళభక్తులు దాడి చేయడంతో క్యూలైన్లలో ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు.

టీటీడీ కీలక మార్పులు

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు తిరుమలలో రూమ్​లు దొరకని పరిస్థితి ఉండటంతో ఇకపై తిరుపతిలోనే రూమ్​ల బుకింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిని అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో ఎ.వి. ధర్మారెడ్డి వెల్లడించారు. ‘‘తిరుమలలో రూంల కేటాయింపును ఇకపై తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. దీనివల్ల తిరుమలలో రూంలు దొరకని భక్తులు తిరుపతిలోనే బస చేసే అవకాశం ఉంటుంది” అని ఆయన వెల్లడించారు. త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లను కూడా ప్రారంభిస్తామని, టోకెన్లు తీసుకున్న తర్వాత భక్తులు తిరుపతిలోనే రూంలు బుక్ చేసుకుని తిరుమలకు రావాల్సి ఉంటుందన్నారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శన సమయాన్ని ఉదయం10 గంటలకు మార్చనున్నట్లు తెలిపారు. తిరుమలలో ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా తెచ్చిన క్యూఆర్ కోడ్ విధానం సక్సెస్ అయిందని, దీనిని త్వరలో మరిన్ని చోట్ల అందుబాటులోకి తెస్తామన్నారు. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోందని, భక్తులు సహకరించాలని కోరారు. అడ్వాన్స్డ్, బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులు తిరుపతిలోనే బస చేసి దర్శనానికి రావాలన్నారు.