ఫిరాయింపులపై కోమటిరెడ్డి, తలసాని వాగ్వాదం

ఫిరాయింపులపై కోమటిరెడ్డి, తలసాని వాగ్వాదం

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌కు మధ్య మంగళవారం అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పద్దులపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ.. భూనిర్వాసితుల విషయంలో  మల్లన్నసాగర్‌‌‌‌కు ఒక ప్యాకేజీ.. డిండికి వేరే ప్యాకేజీ అమలు చేస్తున్నారని, రాచరికవ్యవస్థలా తయారైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని టీఆర్​ఎస్ కొనేసిందని ఆరోపించారు.

కోమటిరెడ్డి కామెంట్స్​పై   తలసాని ఘాటుగా రియాక్టయ్యారు. ‘‘ఈయనకు, వీళ్ల బ్రదర్‌‌‌‌కు  పబ్లిసిటీ పిచ్చి. అందుకే ఏదిపడితే అది మాట్లాడుతారు. రాజగోపాల్​రెడ్డి ఇప్పుడే పార్టీలో ఉన్నారో తెలియదు. బాధ్యత  లేకుండా ఆయన మాట్లాడేదాన్ని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సపోర్ట్​ చేస్తున్నారు. ఎందుకంటే రేపు పార్టీలో ఉంటడని ఆశ. కానీ ఆయన ఉండడు’’అని కౌంటరిచ్చారు. దీనికి రాజగోపాల్.. తాను రాష్ట్రం గురించి మాట్లాడితే మంత్రి ఇంకేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ పార్టీ మారాల్సివస్తే పదవికి రాజీనామా చేస్తానని, తలసానిలా ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేరలేదని కోమటిరెడ్డి రిటార్ట్​ ఇచ్చారు.

దానం మంత్రిగా ఫీలవుతున్నారా?

నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ మాటతప్పారని కోమటిరెడ్డి ఆరోపించారు. కుర్చీవేసుకుని మరీ డిండి, శివన్నగూడెం ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తానని చెప్పిన సీఎం వాటిని గాలికొదిలేశారని, బడ్జెట్​లో ఇరిగేషన్​ శాఖకు భారీగా నిధులు తగ్గించారని, రాష్ట్రంలో పనిచేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని అన్నారు. సొంత ఊరు చింతమడకలో ఇండ్లు కడితే రాష్ట్రమంతటా కట్టినట్లు కాదని విమర్శించారు. రాజగోపాల్‌‌‌‌ రెడ్డి ప్రసంగంపై టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ స్పందిస్తూ.. కాంగ్రెసోళ్లకి నైతిక విలువలు లేవని, అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దానం కామెంట్స్​పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడానికి దానం ఇంకా మంత్రికాలేదని, బహుశా మంత్రి అయిపోయినట్లు ఆయన ఫీలవుతున్నారేమో అని ఎద్దేవా చేశారు.

clash between Komatireddy Rajagopal Reddy and Talasani Srinivas Yadav in Assembly on Tuesday