
- సీనియర్లు, జూనియర్లు ఒకరిపై ఒకరు దాడి
- ఇద్దరు సీనియర్లకు తీవ్ర గాయాలు.. నలుగురు జూనియర్లపై కేసు
- సికింద్రాబాద్ అవినాష్ కామర్స్ కాలేజీలో ఘటన
సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ లోని అవినాష్ కామర్స్ కాలేజీ ఫ్రెషర్స్పార్టీ తీవ్ర ఘర్షణకు దారితీసింది. సీనియర్లు, జూనియర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్కాలేజీ యాజమాన్యం గురువారం రాత్రి సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఫ్రెషర్స్పార్టీ ఏర్పాటు చేసింది. ఫస్ట్, సెకండ్ఇయర్స్టూడెంట్లు పాల్గొన్నారు. సీనియర్స్టూడెంట్లు డ్యాన్స్చేస్తుండగా, జూనియర్స్టూడెంట్లు కొందరు తోశారు. ఈ క్రమంలో సీనియర్స్టూడెంట్లు జూనియర్లను కొట్టారు.
యాజమాన్యం, మిగిలిన విద్యార్థులు వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ వెంటనే పార్టీని ముగించి అందరినీ ఇండ్లకు పంపించేశారు. బయటకు వెళ్లాక నలుగురు జూనియర్స్టూడెంట్లు కర్రలతో సీనియర్లపై దాడికి దిగారు. ఇద్దరు సీనియర్స్టూడెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణ పడుతున్న స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. నలుగురు జూనియర్లపై కేసు నమోదు చేసినట్లు బేగంపేట పోలీసులు తెలిపారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గొడవ జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. యాజమాన్య వైఖరిపై బాధిత తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని వాపోయారు.