మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు.. బీఆర్ఎస్ అసమ్మతి లీడర్ల అసంతృప్తి రాగం

మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు.. బీఆర్ఎస్ అసమ్మతి లీడర్ల అసంతృప్తి రాగం

కోదాడ, వెలుగు: ‘గత ఎన్నికల్లో మేమంతా పార్టీకి కట్టుబడి పని చేసినం.. అప్పుడే పార్టీలోకి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చినా గెలిపించినం.. అప్పట్నుంచి ఎమ్మెల్యే నియంతలా ప్రవర్తిస్తున్నడు.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ దందాలను ప్రోత్సహిస్తున్నడు.. రాబోయే ఎన్నికల్లో హైకమాండ్​ ఆయనకు టికెట్ ఇవ్వొద్దు’ అని  సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్గం మల్లయ్య యాదవ్​ను ఉద్దేశించి ఆ పార్టీ అసమ్మతి లీడర్లు అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే  మల్లయ్య వైఖరిపై కొంతకాలంగా మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీషతో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్​చార్జి శశిధర్ రెడ్డి, మాజీ డీసీసీబీ  చైర్మన్ పాండురంగరావు, రాష్ట్ర కార్యదర్శి యెర్నేని బాబు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీరంతా కోదాడలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జెండావిష్కరణ చేసి మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. తర్వాత మాట్లాడుతూ ఈసారి కూడా ప్రస్తుత ఎమ్మెల్యేనే గెలిపించాలని మంత్రి జగదీశ్​రెడ్డి తమకు సూచించారని, అయితే తాము సహకరించబోమని మంత్రికి చెప్పినట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు కాకుండా వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసి గెలిపిస్తామని ప్రకటించారు.