కాంగ్రెస్​లో కమిటీల లొల్లి

కాంగ్రెస్​లో కమిటీల లొల్లి
  • పలు నియోజకవర్గాల్లో కేడర్ ఫైర్
  • గాంధీభవన్​కు మునుగోడు, గజ్వేల్, సిద్దిపేట నేతలు
  • మల్లు రవి ఘెరావ్
  • ఖానాపూర్​లో కమిటీపై రెండు ఆర్డర్లు
  • మహేశ్​కుమార్ గౌడ్ ఆర్డర్​ను కాదని మరో ఆర్డర్ ఇచ్చిన మల్లు రవి
  • రెండోసారి ఆర్డర్ ఇవ్వడంపై ఏఐసీసీ షోకాజ్!

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో మండల కమిటీల నియామకం మంటలు రేపుతున్నది. గురువారం చిన్నగా మొదలైన సమస్య.. శుక్రవారం తీవ్రమైంది. మునుగోడు, భువనగిరి నియోజకవర్గాలతో షురువైన లొల్లి మరిన్ని నియోజకవర్గాలకు పాకింది. మునుగోడు, గజ్వేల్, ఖానాపూర్, ఖమ్మం, రామగుండం, ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్ర హీంపట్నం, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, కల్వకుర్తి, ఆలేరు, కోదాడ, సిద్దిపేట, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్, జనగామ, పాలకుర్తి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ని మండలాల కమిటీ అధ్యక్షుల నియామకం పార్టీ శ్రేణుల్లో అలజడిని సృష్టించింది. 

నియామకాలపై నిరసన తెలుపుతూ మునుగోడు, గజ్వేల్, సిద్దిపేట, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్ గాంధీభవన్​కు వచ్చి.. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు, గజ్వేల్, సిద్దిపేటకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ మెట్ల మీద కూర్చుని నిరసన తెలిపారు. నర్సారెడ్డిని సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలంటూ గజ్వేల్ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేశారు. కోవర్ట్​ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ సీనియర్ నేతలకు ఫిర్యాదు చేశారు. భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ రెడ్డినీ తప్పించాలని ఆ జిల్లా నుంచి వచ్చిన నేతలు డిమాండ్ చేశారు.

దృష్టి సారించిన హైకమాండ్

ఖానాపూర్ నియోజకవర్గ మండల కమిటీల నియామ కం పెద్ద దుమారం రేపింది. గురువారం మహేశ్ కుమార్ గౌడ్​.. మండల కమిటీలను నియమించారు. అయితే, ఆ తెల్లారి పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఖానాపూర్, జన్నారం టౌన్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల కమిటీల అధ్యక్షులను మారుస్తూ మరో ఆర్డర్ ఇచ్చారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. మల్లు రవికి షోకాజ్ నోటీసును జారీ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకసారి ఆర్డర్ ఇచ్చాక.. నియామకాలను మారుస్తూ మళ్లోసారి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని షోకాజ్​లో ప్రశ్నించినట్టు సమాచారం.
 

గాంధీభవన్​ గేటుకు తాళం

గురువారం భువనగిరి నియోజకవర్గ నేతల నుంచి నిరసన సెగను ఎదుర్కొన్న మల్లు రవికి.. శుక్రవారం మునుగోడు నియోజకవర్గ నేతల సెగ తగిలింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ తమవారికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదని పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవితోనూ ఆమె వర్గానికి చెందిన నేతలు భేటీ అయ్యారు. అయితే, గాంధీభవన్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో కార్యకర్తలు రవిని ఘెరావ్​ చేశారు. గాంధీభవన్​ గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆర్గనైజేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని మల్లు రవి వారికి చెప్పారు. 

మండల కమిటీల నియామకాల్లో గొడవలు సహజమేనని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తారని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా పాల్వాయి స్రవంతి సహా కేడర్ వెనక్కు తగ్గలేదు. మెట్ల మీద కూర్చుని రెండు గంటల పాటు ఆందోళన చేశారు. కమిటీలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. అంతకుముందు మహేశ్​కుమార్​గౌడ్​ను కలిసిన స్రవంతి బృందం నేతలు.. అసలు నియోజకవర్గంలో ఓటే లేని వ్యక్తికి మండల కమిటీ పదవి ఎలా ఇస్తారంటూ నిలదీశారు.